పవన్ పై ఏపీ మంత్రుల ఫైరింగ్ షురూ

Update: 2017-01-24 10:34 GMT
ప్రశ్నించటం కోసమే తాను పార్టీ పెట్టినట్లుగా.. రాజకీయాల్లోకి వచ్చినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసినప్పుడు నవ్వినోళ్లు ఉన్నారు. తప్పుపట్టినోళ్లు ఉన్నారు. అలాంటి వారిలో తెలుగుదేశం నేతలు ఉన్నారు. అయితే.. ఆయన ఇమేజ్ తమకు అనుకూలంగా మారుతుందని భావించినప్పుడు చంద్రబాబు కంటే పవన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటమే కాదు.. పవన్ కు వంగి వంగి నమస్కారాలు పెట్టినోళ్లు ఉన్నారు. తమ నియోజకవర్గానికి వచ్చి కాసింత ప్రచారం చేయమని ప్రాధేయపడినోళ్లు ఉన్నారు.

ఎన్నికలు అయిపోయి.. పవర్ లోకి చేతికి వచ్చాక.. తమ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్న పవన్ ఇప్పుడు టీడీపీ నేతలకు శత్రువయ్యారు. వీలైతే బాకా ఊదాలే కానీ.. అలా విమర్శించటం ఏమిటన్నది తమ్ముళ్ల బాధ. ఆ విషయాన్ని ఇప్పటికే పలువురు నేతలు తమదైన శైలిలో పవన్ పై విమర్శలు చేశారు. పవన్ లాంటోడితో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. జనసేనాధిపతిని విమర్శించొద్దన్న ఆదేశాలతో కాస్తంత వెనకడుగు వేశారు.

ఆ మధ్య ఏపీకి ప్రత్యేక హోదా మీద గళం విప్పిన పవన్.. ఆ తర్వాత కామ్ అయ్యారు. సరైన సమయం కోసం చూస్తున్న ఆయనకు జల్లికట్టు వివాదం నేపథ్యంలో మెరీనాబీచ్ తరహా ఆందోళన ఆయన దృష్టిని ఆకర్షించినట్లుంది. వెంటనే వ్యూహం సిద్ధం చేసిన ఆయన.. రిపబ్లిక్ డే సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద హోదా కోసం మౌన నిరసన చేపడితే తన మద్దతు ఉంటుందన్న విషయాన్ని వెల్లడించారు.

ఇలాంటి నిరసనను ఏ మాత్రం ఊహించని తెలుగు తమ్ముళ్లకు కరెంటు షాక్ తగిలినట్లైంది. మెరీనా నిరసన యావత్ దేశం చూడటమే కాదు.. కేంద్రంపై ఎంతటి ఒత్తిడిని పెంచిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. ఇలాంటి పరిస్థితే ఏపీకి వస్తే.. బాబు సీటుకు ఎంత ఇబ్బందో తెలియందో కాదు. అందుకే.. ఇప్పుడు టీడీపీ మంత్రులు పవన్ పేరు ఎత్తితేనే ఫైర్ అవుతున్నారు.

తాజాగా ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. జల్లికట్టుకు.. ప్రత్యేక హోదాకు సంబంధం లేదంటూఅధినేత చెప్పిన మాటల్ని వల్లె వేయటమే కాదు.. ఎన్నికల ప్రచార సమయంలో మోడీ పక్కనే కూర్చున్న పవన్.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ప్రధానితో మాట్లాడాలని చెబుతున్నారు. అయ్యన్న తరహాలోనే మరో మంత్రి చినరాజప్ప సైతం.. జల్లికట్టుకు.. ప్రత్యేక హోదాఅంశం సంబంధం లేదని మండిపడుతున్నారు. అయినా.. మంత్రుల అమాయకత్వం కానీ.. పవన్ ఎప్పుడూ జల్లికట్టు.. హోదా ఒకటేనని చెప్పలేదే? కానీ.. వాదనను పక్కదారి పట్టించటం కోసం చేస్తున్న విమర్శలు చూసినప్పుడు నవ్వు రాక మానదు. పవర్ లో ఉన్న తమ అధినేత ఢిల్లీకి వెళ్లి ప్రధానిపై ఒత్తిడి తీసుకొచ్చి పని పూర్తి చేయాలే తప్పించి.. దాన్ని వదిలేసి.. పవన్ లాంటోడి మీద పడటం ఏమిటో..? మోడీకి ఒకవైపు కూర్చున్న పవన్ గురించి మాట్లాడుతున్న తెలుగు తమ్ముళ్లు మరోవైపు కూర్చున్న చంద్రబాబు గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News