త‌మ్ముళ్ల ప్ర‌వ‌ర్త‌న‌తో మంత్రి వాకౌట్

Update: 2016-08-07 09:53 GMT
అవును. త‌మ్ముళ్ల డిమాండ్లు - ఆరోప‌ణ‌ల‌తో - ఎవ‌రి దారి వారిదేన‌నే ప్ర‌వ‌ర్త‌న ఏకంగా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు - మంత్రి ఆ స‌మావేశం నుంచి జంప్ అయ్యారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో జరుగుతున్న తెదేపా నియోజకవర్గాల వారీ సమీక్షల్లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. జిల్లా ఇన్‌ ఛార్జి మంత్రి అయ్యన్నపాత్రుడుకు ఈ స్థాయిలో కాలిపోయేలా స్థానిక ప‌రిస్థితులు క‌నిపించాయి. దీంతో అక్క‌డిక‌క్క‌డే స‌హ‌చ‌ర మంత్రిపై ఆయ‌న ఫైర‌య్యారు.

ఏలూరులో జ‌రుగుతున్న పార్టీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లో  పలువురు నాయకులు క్షేత్రస్థాయిలో సమస్యలను  దృష్టికి తీసుకువచ్చారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారిని విస్మరించకుండా తగు న్యాయం చేయాలని కోరారు. కొందరు ప్రజాప్రతినిధులు కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. మంత్రి పీతల సుజాత సొంత నియోజకవర్గమైన చింతలపూడిలో పార్టీ సమన్వయకర్తలను నియమించకపోవడంపై మంత్రి అయ్యన్నపాత్రుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమిస్తే చింతలపూడి నియోజకవర్గంలో నియమించకపోవడం ఏమిటని మంత్రి అయ్యన్నపాత్రుడు మంత్రి పీతల సుజాతను ప్రశ్నించారు. తాను సమన్వయకర్తలను నియమించలేదని ఆమె బదులివ్వగా.. ఎప్పుడో ఈ ప్రక్రియను పూర్తిచేయమని చెబితే ఇంత వరకు నియమించలేదని ఆయన ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

సమావేశం జరుగుతుండగా నాయకులు ఎవరి మానాన వారు మాట్లాడుతుండటంతో ఆగ్రహించిన ఆయన బయటికి వచ్చేశారు. స‌మీక్షా స‌మావేశానికి 70 మంది వరకు హాజరుకాగా - ఎవరికి వారు నియోజకవర్గ సమస్యలను లేవనెత్తసాగారు. నియోజకవర్గానికి సమన్వయకర్తలు 10-30 మంది వరకే ఉంటారని, 70 మంది వరకు సమావేశానికి వచ్చేశారని మీరంతా ఎవరని అయ్యన్నపాత్రుడు వారిని ప్రశ్నించారు. మండలానికి ముగ్గురు మాట్లాడాలని చెబితే ఎవరికివారు ఇష్టారాజ్యంగా సమస్యలు చెబుతుండటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాట కూడా వినకుండా ఎవరికి వారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, ఇలాగైతే వెళ్తానని సమావేశం నుంచి అయ్య‌న్న‌పాత్రుడు బయటికి వచ్చేశారు. మంత్రి పీతల సుజాత - ఇతర నాయకులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆయన వినిపించుకోలేదు. దీంతో సమావేశం అక్కడితో ముగిసింది.

దెందులూరు నియోజకవర్గంలో కొందరు నాయకులు ఇతర పార్టీల నాయకులతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సమీక్షలో పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గ సమీక్ష సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తీవ్రంగా విఫలమవుతున్నామని, పథకాల విషయంలో అధికారుల పెత్తనం కొనసాగుతోందని - దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని స్థానిక నాయకులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కొందరు నాయకులు పోలీస్‌ స్టేషన్‌ లు - తహశీల్దారు - మండల పరిషత్తు కార్యాలయాలను కేంద్రాలుగా చేసుకుని సెటిల్‌ మెంట్లు చేస్తున్నారని, వారివల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని మంత్రికి వివరించారు.గోపాలపురం నియోజకవర్గంలో అధికారులు పార్టీ నాయకులు - కార్యకర్తలకు కనీసం ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదని పలువురు మంత్రి అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకువచ్చారు. గృహనిర్మాణం గురించి గొప్పగా ప్రచారం చేసినా ఇప్పటి వరకు ప్రక్రియ ప్రారంభంకాలేదని చెప్పారు. మరుగుదొడ్లు నిర్మిస్తున్నప్పటికీ బిల్లులు త్వరగా రావడంలేదని పేర్కొన్నారు. తామే నిర్మాణాలు చేసుకోమని చెప్పడంతో చాలామంది ముందుకు వచ్చారని, బిల్లులు సకాలంలో రాకపోవడంతో వారికి జవాబు చెప్పుకోలేక పోతున్నామని ఆవేదన వెళ్లగక్కారు. ఉండి నియోజకవర్గ సమీక్ష సందర్భంగా గృహనిర్మాణ పథకం అమలులో జాప్యంపై నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ఈనెల నుంచి గృహనిర్మాణాలు ఊపందుకుంటాయని చెప్పారు.
Tags:    

Similar News