బీఎస్ యడ్యూరప్ప.. పెద్దగా పరిచయం అక్కర్లేని రాజకీయ నేత. దక్షిణాదిలో అడ్రస్ కూడా లేని బీజేపీకి కేరాఫ్ కర్ణాటక అనిపించేలా కమల వికాసం చూపించిన నిఖార్సైన ఆరెస్సెస్ నేత. తొలిసారి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే అది పూర్తిగా యడ్యూరప్ప పుణ్యమే! అందుకే రెండో మాట కూడా లేకుండా అప్పట్లో యడ్యూరప్పను బీజేపీ అధిష్టానం సీఎంను చేసేసింది. అంతేకాదు, పాలనపై ఎలాంటి అదుపు ఆజ్ఞలు లేకుండా ఆయనకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛను సైతం అప్పగించేసింది. ఈ అతి స్వేచ్ఛే ఇప్పుడు కొంప ముంచిందని చెబుతున్నారు విశ్లేషకులు.
యడ్యూరప్ప ఒక రాజకీయ నేత మాత్రమే కాదని, ఆయనలో సామాజిక దురాచారాలు చాలా ఉన్నాయని, తన అధికారం కోసం సొంత కులంలో సైతం చిచ్చు పెట్టేందుకు ఆయన వెనుకాడబోడని కూడా ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మాజీ సీఎం యడ్యూరప్పపై కన్నడ నటుడు చేతన్ మండిపడ్డారు. యడ్యూరప్ప విభజించు - పాలించు అనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా లింగాయత్ కులస్తులే ఆయనకు తగినబుద్ది చెప్పాలన్నారు. బెంగళూరులోని బసవ సమితి ప్రాంగణంలో జన సామాన్య వేదిక ఏర్పాటు చేసిన లింగాయత్ కులస్తులకు ప్రత్యేక ధర్మం కావాలి అనే అంశంపై జరిగిన చర్చలో చేతన్ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా చేతన్ మాట్లాడుతూ.. హిందూ - ముస్లిం - క్రిష్టియన్ లకు ధర్మాలు ఎలా ఉన్నాయో లింగాయత్ లకు అలాగే ప్రత్యేక ధర్మం అవసరమని చెప్పాడు. ఇదే సమయంలో తమ వర్గానికే చెందిన యడ్యూరప్పపై నిప్పులు చెరిగారు. అధికారం కోసం యడ్యూరప్ప ఎంతకైనా తెగబడతాడని విమర్శించాడు. చివరకు సామాజిక దురాచారమైన చేతబడులను సైతం ప్రోత్సహించారని, వివిధ మఠాలకు రూ. 300 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారని మండిపడ్డాడు. లింగాయత్ కులస్తులను విభజించి రాజకీయాలు చెయ్యాలని యడ్డీ ప్రయత్నిస్తున్నాడన్నారు.
దీంతో చేతన్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కర్ణాటకలో దుమారానికి తెరలేచింది. నిజానికి వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో కర్ణాటకలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ మరోసారి గెలిచి.. తమ సత్తా చూపాలని భావిస్తున్న బీజేపీ.. యడ్యూరప్పకే ఈ బాధ్యతలు అప్పగించింది. ఇంతలో తన సొంత సామాజిక వర్గంలోనే తనపై ఇలా ఆరోపణలు రావడంతో అది కూడా రూ.300 కోట్లు ఇచ్చి సీఎం సీటు దక్కించుకున్నాడనే ఆరోపణలు రావడంతో యడ్డీ ఇప్పుడు పెద్ద గోతిలో పడిపోయినట్టేనని, విపక్షాలు ఊరుకునే ప్రసక్తి లేదని తెలుస్తోంది!! మరి ఈ విషయంలో అపర చాణిక్యుడిగా బీజేపీ అభివర్ణించే యడ్డీ ఎలా వ్యవహరిస్తాడో చూడాలి.