రాందేవ్ ‘కింభో’కు గూగుల్ - యాపిల్ షాక్..

Update: 2018-05-31 14:30 GMT
రాందేవ్ బాబా.. అడుగుపెట్టిన ప్రతీ రంగంలోనూ దూసుకుపోతున్నారు. బీజేపీ మద్దతుతో ఆయన చేస్తున్న పతంజలి వ్యాపారం ఇప్పుడు పదివేల కోట్లకు చేరువైంది. దేశమంతా విస్తరించింది. నగరాల్లో గల్లీకో పతంజలి స్టోర్ నెలకొల్పారు. చిన్న పట్టణాలు - గ్రామాలకు కూడా పతంజలి ప్రోడక్ట్స్ విస్తరిస్తున్నాయి.. ఇక ఆ బాటలోనే తాజాగా బీఎస్ ఎన్ ఎల్ తో కలిసి రాందేవ్ బాబా టెలికాం రంగంలోకి ప్రవేశించారు.  బీఎస్ ఎన్ ఎల్ తో కలిసి పతంజలి స్వయం సంవృద్ధి సిమ్ కార్డులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. రూ.144కే అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ లు, డేటా అందించనున్నట్టు రాందేవ్ బాబా ప్రకటించారు.అంతేకాక పతంజలి సిమ్ యూజర్లకు 10 శాతం పతంజలి ఉత్పత్తులపై రాయితీ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.   

ఇప్పుడు తాజాగా దేశంలో ఎక్కువమంది వాడుతున్న మేసేజింగ్ యాప్ వాట్సాప్ కు షోక్ ఇచ్చాడు రాందేవ్ బాబా... దేశీయ కొత్త ‘కింభో’ యాప్ ను ఆవిష్కరించారు. ఈ మేరకు పతంజలి ప్రతినిధి ఎస్కే తిజారావాలా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘ఇక భారత్ మాట్లాడుతుంది.. వాట్సప్ కు గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ఈ స్వదేశీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోండి’ అంటూ తిజారావాలా కోరారు.
 
అయితే రాందేవ్ బాబాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. విడుదలైన మొదటి రోజు కాకముందే గూగుల్ ప్లే స్టోర్ దీనిని తొలగించింది. ఐఫోన్ యాప్ స్టోర్ నుంచి కూడా ఇది మాయమైంది. డౌన్ లోడ్ చేసుకున్న వారి నుంచి యాప్ ఓపెన్ కావడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గూగుల్ - యాపిల్ ఈ ‘కింభో’యాప్ ను స్టోర్ ల నుంచి తొలగించాయి.

కింభో యాప్ లో కొన్ని బగ్స్ ఉన్నాయని.. యాప్ ఓపెన్ చేయగానే పాకిస్తానీ నటి ఫొటోలు కనిపించాయంటూ ఓ ట్విట్టర్ యూజర్ స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. దీంతో సాంకేతిక కారణాల వల్ల రాందేవ్ బాబా ‘కింభో’ యాప్ ప్రస్తుతానికి తొలగించబడింది. దీన్ని మరింత మెరుగ్గా చేసి త్వరలోనే విడుదల చేసేందుకు రాందేవ్ బాబా సిద్ధమైనట్లు తెలిసింది.
Tags:    

Similar News