బాబాకు జీఎస్టీ ఇప్పుడు చేదైంది

Update: 2017-06-03 10:49 GMT
దేశ ప‌న్నుల విధానంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు తెర తీస్తుంద‌ని భావిస్తున్న జీఎస్టీని మొద‌ట స‌మ‌ర్థించిన వారు.. ఇప్పుడు ఒక్కొక్క‌రుగా వ్య‌తిరేకిస్తున్నారు. జీఎస్టీ బిల్లు మీద గ‌తంలో సంతోషాన్ని వ్య‌క్తం చేసిన ప్ర‌ఖ్యాత యోగా గురువు రాందేవ్ బాబా తాజాగా మాత్రం చిరాకు ప‌డిపోతున్నారు. మోడీ స‌ర్కారు తీరుపై గుర్రుగా ఉన్నారు.

నిన్న‌టివ‌ర‌కూ జీఎస్టీ అంటేసానుకూలంగా ఉన్న బాబాగారికి.. ఉన్న‌ట్లుండి ఏమైంది? అన్న సందేహానికి స‌మాధానం వెతికితే.. ఆర్థిక అంశాలు బాబా మీద సైతం ఎంత ప్ర‌భావం చూపిస్తాయో అర్థ‌మ‌వుతుంది.

మొద‌ట్లో జీఎస్టీకి జై కొట్టిన బాబా రాందేవ్‌.. త‌ర్వాతి కాలంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టానికి కార‌ణం.. జీఎస్టీలో ఆయ‌న చేసే ఆయుర్వేద వ్యాపారాన్ని ప్ర‌భావితం చేసేలా ప‌న్నురేటును భారీగా పెంచ‌ట‌మ‌న్న విష‌యం క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం ఉన్న 5 శాతం ప‌న్ను రేటుకు భిన్నంగా ఆయుర్వేద ఉత్ప‌త్తుల‌పై 12 శాతం ప‌న్నురేటును డిసైడ్ చేయటంపై బాబా రాందేవ్ సీరియ‌స్ గా ఉన్నారు. ఆయుర్వేద ఉత్ప‌త్తుల‌పై ఇంత భారీగా ప‌న్ను పెంచ‌టం స‌రికాదంటున్నారు.
అల్లోప‌తి.. హోమియోప‌తిపై ఇప్ప‌టికే అమ‌ల‌వుతున్న 5 శాతం ప‌న్నురేటును య‌ధావిధిగా కొన‌సాగిస్తూ.. ఆయుర్వేదం మీద మాత్రం 12 శాతం ప‌న్నును విధించ‌టం ఏమిటంటూ నిల‌దీస్తున్నారు. అంత‌రించిపోతున్న ఆయుర్వేద వైద్య విధానాన్ని ప‌తంజ‌లి బ్రాండ్ ద్వారా తిరిగి వెలుగులోకి తెస్తున్నామ‌ని.. ఇలాంటి వేళ ఇంత భారీ ప‌న్నురేటు విధించ‌టం స‌రికాదంటున్నారు.

ఆయుర్వేద కేట‌గిరిపై అధిక జీఎస్టీని విధించ‌టం త‌న‌కు ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని ఆయ‌న చెబుతున్నారు.  స‌ర‌స‌మైన ధ‌ర‌కు సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఆయుర్వేద విధానం తాజా ప‌న్నురేటుతో ఇబ్బందిగా మార‌తుంద‌న్న ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అంత‌ర్జాతీయంగా ఆయుర్వేదానికి భారీగా ప్రోత్స‌హాం అందిస్తున్న భార‌త ప్ర‌భుత్వం.. తాజాగా ప‌న్నురేటును భారీగా పెంచ‌టం ప‌ట్ల ఆయుర్వేదిక ఔష‌ద త‌యారీదారుల అసోసియేష‌న్ సైతం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది.

తాజా ఎపిసోడ్‌ తో రాందేవ్ బాబా వారికి ఒక విష‌యం అయితే అర్థ‌మై ఉండాలి. బిల్లు ద‌శ‌లో స‌మ‌ర్థించ‌టం క‌న్నా.. చ‌ట్టంగా రూపొందే వ‌ర‌కూ వెయిట్ చేసి త‌న వాద‌న‌ను వినిపించాల‌న్న విష‌యం ఆయ‌న‌కు అర్థ‌మై ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News