మోడీది రైట్ చాయిస్ అంటూ...

Update: 2022-07-13 01:30 GMT
చంద్రబాబునాయుడా మజాకా అని మళ్ళీ చెప్పుకోవాలి. లేకపోతే మరోసారి రాష్ట్రపతి ఎన్నికల్లో చివరాఖరున ఆయన తనదైన శైలిలో చక్రం తిప్పేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీకి ఈ రోజుకు ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీల మద్దతును ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ప్రకటించడం ద్వారా వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో విజయవాడ వచ్చిన ఆమెను గేట్ వే హొటల్ లో స్వయంగా కలసి మద్దతు ఇవ్వడం విశేషమైన రాజకీయ  పరిణామంగా చెప్పాలి.

ఏపీలో టీడీపీ బీజేపీతో పొత్తు కోసం చాలా కాలంగా చూస్తున్న సంగతి విధితమే. అయితే అది ఏ కోశానా పడడంలేదు. దానికి అధికార వైసీపీ కారణం. వైసీపీ అధినేత జగన్ కి బాబుకు పడదు, దాంతో బలమైన పార్టీగా ఉన్న వైసీపీని బీజేపీ పెద్దలు వదులుకోవడంలేదు. అయితే ఇవన్నీ ఇలా ఉండగానే బాబు మాత్రం బాగానే చక్రం తిప్పేశారు.

రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము విజయవాడకు వస్తారనగా ఒక రోజు ముందు ఆమెకే తమ మద్దతు అని చెప్పడం తోనే తనదైన పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. అదే టైమ్ లో తనకు ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడిని ఉపయోగించారు. బీజేపీ నేతలతో మాట్లాడి మరీ ముర్ముని స్వాయంగా కలసి మద్దతు ఇచ్చేలా చూసుకున్నారు. ఈ సందర్భంగా బాబు గత మూడు రాష్ట్రపతుల ఎన్నికల‌లో తన వంతు పాత్ర ఏంటి అన్నది ముర్ముకు వేదిక మీద వివరించారు.

వాజ్ పేయ్ ప్రధానిగా ఉండగా అబ్దుల్ కలాం కి తాను మద్దతు ఇచ్చానని చెప్పుకున్నారు. అలాగే 2017లో రాం నాధ్ కోవింద్ కి కూడా తమ పార్టీ మద్దతు ఇచ్చిందని అన్నారు. ఇపుడు ఎస్టీ మహిళ అయిన ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. ఇక ముర్ముని రాష్ట్రపతిగా ఎంపిక చేసి ప్రధాని నరేంద్ర మోడీ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు అంటూ ఆకాశానికి ఎత్తేశారు.

అదే టైమ్ లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కూడా తమ పార్టీ అభ్యర్ధికి మద్దతు ప్రకటించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వేదిక మీద  ఆసక్తికరమైన దృశ్యాలు అక్కడ కనిపించాయి. బీజేపీ నేత సోము వీరాజు, కిషన్ రెడ్డి, చంద్రబాబు ఒకే చోట కూర్చోవడం వంటివి చూసిన వారికి తొందరలోనే బాబు ఎన్డీఎయే కూటమిలో కీలకం అవుతారా అన్న చర్చ కూడా వస్తోంది. ఏదేమైనా లాస్ట్ పంచ్ అంటే నాదే అని ద్రౌపది ముర్ము విషయంలో మద్దతు ఇచ్చి వైసీపీకి ధీటుగా నిలిచారు బాబు. దటీజ్ బాబు అంతే.
Tags:    

Similar News