బీజేపీ కార్యకర్తపై బాబూ మోహన్ దారుణ కామెంట్స్..: ఆడియో వైరల్

Update: 2023-02-07 15:00 GMT
మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత బాబు మోహన్ కు సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బీజేపీ కార్యకర్త తనతో పనిచేస్తానని చెప్పడంతో.. ఆయనపై దారుణమైన కామెంట్స్ చేసినట్లు ఆడియోలో వినబడుతోంది. ప్రస్తుతం బీజేపీలో కొనసాగున్న బాబు మోహన్ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ లీకైన ఆడియోలో ఉంది. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ కార్యకర్త బాబు మోహన్ కు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది..? బాబు మోహన్ అలా ఎందుకు అన్నాడో..? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయంపైనే ఇప్పుడు బీజేపీతో పాటు ఇతర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఇటీవల జోగిపేటకు చెందిన వెంకటరమణ అనే బీజేపీ కార్యకర్త నేరుగా నటుడు, రాజకీయ నాయకుడు అయిన బాబు మోహన్ కు ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా మీతో పనిచేస్తానని, అందుకు అవకాశం ఇవ్వాలని వెంకటరమణ కోరారు. అయితే 'ఎవడ్రా నువ్వు..? అంటూ బాబు మోహన్ అన్నాడని కార్యకర్త ఆరోపిస్తున్నాడు. అంతేకాకుండా 'నువ్వెంత.. నీ బతుకెంత..?' అని అన్నట్లు ఆరోపించారు. మరోసారి ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చారని వెంకటరమణ అంటున్నారు.

అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడైన బండి సంజయ్ పేరెత్తితే.. బండి సంజయ్ ఎవడ్రా..? అని అన్నట్లు తెలుస్తోంది. తాను ప్రపంచ నాయకుడినని, తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడానికి తనను బీజేపీలోకి తీసుకున్నారని తెలిపారు. అవసరమైతే రేపే పార్టీకి రాజీనామా చేస్తా.. నీ వయసు ఎంత గాడిద.. అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆందోల్ నియోజకవర్గం నుంచి పలు సార్లు పోటీ చేసిన బాబు మోహన్ ప్రస్తుతం అక్కడ ప్రతిపక్ష నేతగానే ఉన్నారు. సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆంథోల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. చంద్రబాబు హయాంలో మంత్రి అయ్యారు.

అయితే 2018లో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఆడియో బయటపడడంతో రాజకీయంగా తీవ్ర చర్చ సాగుతోంది.

ఓ వైపు తెలంగాణలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇలా కొందరు నాయకులు తమ తీరు వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని బీజేపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన వారిని పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపిస్తుండగా.. ఉన్నవారిని కలుపుకోవడంలో విఫలమవుతున్నారని ఇలాంటి సంఘటనల ద్వారా బయటపడుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Similar News