బీజేపీలో చేరిన బాబూ మోహ‌న్!

Update: 2018-09-29 17:56 GMT
  తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేసిన ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్....అదే రోజు 105 మంది ఎమ్మెల్యేల జాబితా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ జాబితాలో అందోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే - కేసీఆర్ కు స‌న్నిహితుడు బాబు మోహ‌న్ పేరు లేక‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అయితే, అందోల్ లో బాబు మోహ‌న్ పై వ్య‌తిరేక‌త ఉంద‌ని, అందుకే ఆయ‌న‌కు కేసీఆర్ టికెట్ ఇవ్వ‌లేద‌ని టాక్ వ‌చ్చింది. దీంతో, కేసీఆర్ పై అసంతృప్తితో ఉన్న బాబూ మోహ‌న్ ...బీజేపీలో చేర‌బోతున్నారంటూ ఊహాగానాలు వ‌చ్చాయి. ఆ పుకార్ల‌ను నిజం చేస్తూ నేడు ఢిల్లీలో అమిత్ షా స‌మక్షంలో బాబు మోహ‌న్ ...బీజేపీలో చేరారు.శనివారం ఉదయం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీ వెళ్ళిన బాబుమోహన్‌....సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.శ‌నివారం మధ్యాహ్నం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వ‌ర్యంలో బాబుమోహన్ బీజేపీలో చేరారు.  బాబూ మోహ‌న్ నిర్ణ‌యం...ప‌లువురు టీఆర్ ఎస్ నాయ‌కుల‌ను షాక్ కు గురి చేసింది.

బీజేపీలో చేరిన అనంత‌రం బాబూ మోహ‌న్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పిలుపు ప్ర‌కార‌మే తాను బీజేపీలో చేరాన‌ని చెప్పారు. తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని అనుకోలేద‌ని, అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపు ప్ర‌కార‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్, హరీశ్ రావు త‌న‌ను టీఆర్ ఎస్ లోకి ఆహ్వానించార‌ని, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. అయినప్ప‌టికీ త‌న‌పై టీఆర్ ఎస్ పెద్ద‌లు వివ‌క్ష చూపుతున్నార‌ని, త‌న‌కు టికెట్ కేటాయించ‌లేద‌ని తెలియ‌డంతో బాధ‌ప‌డ్డాన‌ని అన్నారు. త‌న‌కు టికెట్ ఎందుకు ఇవ్వ‌లేదో చెప్ప‌లేద‌ని, కేసీఆర్ క‌నీసం ఫోన్ కూడా చేసి విష‌యం చెప్ప‌లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మెసేజ్ లు పెట్టినా కేసీఆర్ స్పందించ‌లేద‌న్నారు. ఆ స‌మ‌యంలో అమిత్ షా గారి నుంచి పిలుపు వ‌చ్చింద‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే త‌న బీజేపీలో త‌న పూర్తి కార్య‌చ‌ర‌ణ వెల్ల‌డిస్తాన‌ని అన్నారు. అందోల్‌ టికెట్‌ ఇస్తామని అధిష్టానం నుంచి హామీ లభించడంతో బాబూమోహ‌న్ బీజేపీలో చేరిన‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News