సోమూ 'వీరం'గంపై చెలరేగిపోయాడంతే...

Update: 2015-10-29 04:12 GMT
భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ - త్వరలోనే ఏపీ రాష్ట్ర పార్టీ శాఖ అధ్యక్షుడు కూడా అవుతాడని అనుకుంటున్న సోము వీర్రాజు చంద్రబాబు ప్రభుత్వం మీద ఎంత ఘాటు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారో అందరికీ తెలిసిందే. ఏదో మిత్రపక్షం గనుక.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కలిసి ఉంటున్నాం తప్పితే.. ఆయన అరాచకత్వంపై సానుభూతితో వ్యవహరిస్తున్నాం తప్ప.. లేకపోతే ఈ పాటికి చీల్చి చెండాడేసి ఉండేవాళ్ల అన్నట్లుగా సోము వీర్రాజు ఇప్పటికే పలుమార్లు వీరంగం వేశారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులకు సంబంధించి సరైన ప్రచారం జరగడం లేదంటూ.. తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. అయితే కొన్ని రోజులుగా అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ఈ సోమూ 'వీరం'గం విషయంలో తెలుగుదేశం పార్టీ ఇక సహనం కోల్పోయినట్లుగా కనిపిస్తోంది.

సోము వీర్రాజు తెంపరితనానికి తానే సమ ఉజ్జీ అన్నట్లుగా తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ మీడియా ముందు చెలరేగిపోయారు. అసలు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలను ఆయన వ్యక్తిగత హోదాలో చేస్తున్నారా? లేదా భాజపా పార్టీ తరఫున చేస్తున్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తో చర్చించిన పిమ్మటే, విజయవాడలోని ఆయన క్యాంప్‌ ఆఫీస్‌ బయట మీడియా పాయింట్‌ వద్దనే రాజేంద్రప్రసాద్‌ వీర్రాజు వైఖరిపై నిప్పులు చెరగడం విశేషం.

కేంద్రంనుంచి నిధులు తీసుకుని ప్రచారంలో మోడీ ఫోటోలు పెట్టకపోవడాన్ని వీర్రాజు తప్పుపట్టడంపై రాజేంద్రప్రసాద్‌ అభ్యంతరాలు వెలిబుచ్చారు. రాష్ట్రం నుంచి వసూలు అవుతున్న పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఇస్తున్నారే తప్ప.. కేంద్రం ఉదారంగా ఇస్తున్నదేమీ లేదని ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. మేం లక్ష కోట్లు పన్నులు కడితే.. 45 వేల కోట్లు కేటాయించడమే కాకుండా.. మళ్లీ మా ఫోటోలు - పేర్లు కావాలంటూ ఎగబడడం ఏంటని దెప్పిపొడిచారు. కేంద్రానికి లక్ష కోట్ల పన్నులు ఇస్తాం.. కేంద్ర పథకాలు తెలుగుదేశం నేతల పేర్లు పెడతారా అంటూ ఎద్దేవా చేశారు. మొత్తానికి సోము వీర్రాజు దూకుడుకు బ్రేకులేసే ప్రయత్నం చేశారు.

అయితే ఈ వ్యవహారం ఇక్కడితో సద్దుమణిగే అవకాశం లేదు. సందు దొరికితే చాలు..చంద్రబాబును ఆడిపోసుకోవడానికి సిద్ధంగా ఉన్న సోము వీర్రాజు మళ్లీ దీనిపై తీవ్రంగానే ప్రతిస్పందిస్తారు. కాకపోతే ఈ నాయకుల వాదులాట.. పార్టీల మధ్య మైత్రిని ప్రభావితం చేసేదాకా వెళ్తుందా లేదా చూడాలి.
Tags:    

Similar News