టీఆర్ఎస్‌కు షాక్ త‌ప్ప‌దా?

Update: 2022-03-09 07:45 GMT
ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ ఉద్య‌మ పార్టీ టీఆర్ఎస్‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. కేసీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేశారు. కానీ రాష్ట్రంలో మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌లు కేసీఆర్‌కు అంత ఈజీ కాద‌నిపిస్తోంది.

అటు కాంగ్రెస్‌, బీజేపీతో పాటు ఇటు సొంత పార్టీలో అసంతృప్తులు ఎక్కువ‌వుతుండ‌డ‌మే అందుకు కార‌ణం. ఇటీవ‌ల రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌శాంత్ కిషోర్ బృందం నిర్వ‌హించిన స‌ర్వేలో ఉద్య‌మ కారులు కేసీఆర్‌పై ఆగ్ర‌హంతో ఊగిపోతున్నార‌ని తేలింది. తాజాగా ఆ పార్టీలోని ముఖ్య నేత‌లు, మాజీ మంత్రులు కేసీఆర్‌పై అసంతృప్తితో స‌మావేశాలు నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఖ‌మ్మం వేదిక‌గా..

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నేత‌లు టీఆర్ఎస్ పార్టీ అధినాయ‌క‌త్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు వివిధ సంద‌ర్భాల్లో తెలిసింది. తాజాగా మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అనుచ‌రులు క‌లిసి స‌మావేశం పెట్టుకోవ‌డం స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది.

 ఇప్ప‌టికే అధికార పార్టీలో వ‌ర్గ విభేదాలు తార‌స్థాయికి చేరాయ‌న్న చ‌ర్చ‌కు ఈ స‌మావేశం మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. ఈ స‌మావేశానికి హాజ‌రైన తుమ్మ‌ల‌, పొంగులేటి అనుచ‌రులు త‌ల్లాడ మండ‌లంలో ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీరయ్య‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించారు. తుమ్మ‌ల‌, పొంగులేటి కీల‌క అనుచ‌రుల మ‌ధ్య ఈ భేటీ ఈ ఇద్ద‌రు నాయ‌కుల‌కు తెలీకుండానే జ‌రిగే అవ‌కాశం లేదు. దీంతో తుమ్మ‌ల‌, పొంగులేటి క‌లిసి హైక‌మాండ్‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

జూప‌ల్లి కూడా..

టీఆర్ఎస్ లో అసమ్మతి వర్గాలు ఏకం అవుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీలో తమకు సరైన ప్రాధాన్యం దక్కని నేతలు ఒక్కటవుతున్న‌ట్లే క‌నిపిస్తున్నారు. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలోనే ఆ పార్టీకే చెందిన మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మాత్రం ఖ‌మ్మం చేరుకున్నారు. తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డితో ఆయ‌న సమావేశమయ్యారు. ఓ వైపు వనపర్తిలో కేసీఆర్ కార్యక్రమాలు కొనసాగుతుండగా అక్కడ లేకుండా జూపల్లి ఇతర అసంతృప్త నేతలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.

 అయితే సీఎం తన సొంత జిల్లాకు వచ్చినప్పుడు మాజీ మంత్రిగా పనిచేసిన తనను ఆహ్వానించకపోవడంపై జూప‌ల్లి మ‌న‌స్థాపం చెందినట్టుగా సమాచారం. మ‌రి ఈ అసంతృప్త నేత‌ల‌ను కేసీఆర్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.
Tags:    

Similar News