ఈ విషాదం తెలంగాణకు అవమానం కేసీఆర్?

Update: 2019-10-31 05:14 GMT
గడిచిన కొద్ది నెలలుగా మాయదారి డెంగీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మహానగరంలో ప్రతి రెండు ఇళ్లలో ఒకరు.. ఆ మాటకు వస్తే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు విష జ్వరాల బారిన పడటం చూస్తున్నదే. డెంగీ.. విష జ్వరాల తీవ్రత ఇంతలా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించింది మాత్రం ఏమీ లేదన్న విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా వెలుగుచూసిన ఒక విషాదం ప్రతి ఒక్కరిని అయ్యో అనేలా చేస్తుంది.

కేవలం నెల వ్యవధిలో ఒక కుటుంబం.. మరణాల బారిన పడటమే కాదు.. రోజుల చిన్నారి ఎవరికీ కాకుండా పోవటం చూస్తే.. నిలువెత్తు విషాదం కమ్మేయటం ఖాయం. ఒక జంట. వారికి ఇద్దరు పిల్లలు. ఒకరు ఏడేళ్ల కొడుకు.. మరొకరు ఆరేళ్ల కుమార్తె. వీరికి తోడు ఇంటికి పెద్ద దిక్కుగా తాత. అలాంటి ఇంట్లో ముచ్చటగా మూడోసారి గర్భందాల్చి.. డెలివరీ కోసం రోజులు లెక్కిస్తున్న వేళలో చోటు చేసుకున్న వరుస అనర్థాలతో.. ఆ ఇంట్లో కన్నీళ్లు కార్చే దిక్కులేని దుస్థితి. దీనంతటికి కారణం మాయదారి డెంగీనే.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో విషాదాల్ని చూసినా.. తాజాగా వెలుగుచూసిన ఈ విషాదం మాత్రం ప్రజల గుండెల్ని పిండేస్తోంది. 24 రోజుల వ్యవధిలో నాలుగు నిండు ప్రాణాల్ని డెంగీ బలితీసుకున్న దారుణ ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీ నగర్ కు చెందిన రాజగట్టు.. సోనీ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారింట్లోనే రాజగట్టు తండ్రి ఉంటారు. సోని గర్భవతి. పట్టణంలోని ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నారు రాజగట్టు. నెల క్రితం రాజగట్టుకు తీవ్ర జ్వరం రావటంతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. డెంగీ లక్షణాలు కనిపించటంతో అతడ్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూనే ఆయన మరణించాడు. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే రాజగట్టు తండ్రి లింగయ్యకు డెంగీసోకటం.. ఆయన మరణించారు. ఎనిమిది రోజుల వ్యవధిలోనే ఆరేళ్ల శ్రీవర్షిణి డెంగీతో మరణించింది. కన్నబిడ్డ మరణించిన రోజే నిండు గర్భిణి అయిన సోని తీవ్ర జ్వరంతో బాధ పడుతుండటంతో సోనిని సికింద్రాబాద్ యశోదలో చేర్పించారు. మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. తాజాగా మరణించింది. డెంగీతోనే ఆమె కూడా మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే..  సోనిని యశోదాలో చేర్పించిన తర్వాత వైద్యం కోసం రూ.లక్ష కట్టారు. మరో రూ.2.5లక్షలు చెల్లిస్తే కానీ డెడ్ బాడీ ఇవ్వనని కుటుంబ సభ్యులకు యశోదా యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో.. తాము అంత డబ్బు చెల్లించలేమని.. బాధిత కుటుంబం తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. డెడ్ బాడీ కోసం ఆసుపత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇంత పెద్ద విషాదంలో ఎనిమిదేళ్ల వికాస్.. రోజుల తమ్ముడు మాత్రమే ఇప్పుడు మిగిలారు.

తల్లిని కోల్పోయిన రెండు రోజులు శిశువు ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. సంపన్న తెలంగాణ అంటూ గొప్పలు చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వం.. డెంగీ మహమ్మారిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది? అన్నది ప్రశ్న. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి.. డెంగీ బాధితులకు ఉచితంగా వైద్యం చేయాలన్న ఆదేశం లేదంటే.. డెంగీ చికిత్సకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాల్ని సకాలంలో తీసుకొచ్చి ఉంటే.. ఇలాంటివి చోటు చేసుకునేవి కాదన్న మాట వినిపిస్తోంది.

ఏమైనా.. ఈ విషాదం తెలంగాణ ప్రభుత్వానికి మాయని మచ్చలా చెప్పక తప్పదు. డెంగీని కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం తడబాటుకు గురైందన్న విషయాన్ని ఒప్పుకోక తప్పదు. 
Tags:    

Similar News