అసలు నిజం బయటకు.. మాజీ మంత్రి నారాయణకు బెయిల్

Update: 2022-05-11 03:10 GMT
అదిరే వంట రెఢీ అన్న తర్వాత.. రుచి చూస్తే.. అంతా ఓకే కానీ ఉప్పు మాత్రమే మిస్ అయ్యిందంటే ఎలా ఉంటుందో.. నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడిగా.. అధినేతగా పేరున్న మాజీ మంత్రి నారాయణ అరెస్టు ఎపిసోడ్ లో అనూహ్యమైన నిజం బయటకు వచ్చింది. అదేమంటే.. 2014లోనే నారాయణ తన విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి రాజీనామా చేసేశారు.

దీనికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు ఆయన తరఫు న్యాయవాది బయటపెట్టటంతో ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. నారాయణ తరఫు లాయర్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఆయనకు రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని  న్యాయమూర్తి ఆదేశించటంతో ఆయనకు బెయిల్ మంజూరైంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి నారాయణ అరెస్టు వ్యవహారం చివరకు అనూహ్యమైన మలుపు తిరిగినట్లైంది. హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఏపీ అధికారులు చిత్తూరుకు తరలించారు. మంగళవారం రాత్రి వైద్య పరీక్షల కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు.

నారాయణ విద్యా సంస్థల అధినేతగా నారాయణ ఉన్నారంటూ అభియోగం మోపారని.. కానీ ఆయన 2014 నుంచి నారాయణ విద్యా సంస్థల అధినేతగా వైదొలిగిన విషయాన్ని న్యాయమూర్తికి చెప్పినట్లు వివరించారు.

నారాయణ విద్యా సంస్థలతో ఆయనకు సంబంధం లేదని.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తికి సమర్పించటంతో ఆయనకు బెయిల్ మంజూరు చేసినట్లు చెప్పారు. నారాయణపై నేరారోపణలు నమ్మేలా లేవని జడ్జిఅభిప్రాయానికి వచ్చారని.. దీంతో ఆయనకు బెయిల్ మంజూరైందన్నారు.
Tags:    

Similar News