తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా ‘బక్కని’

Update: 2021-07-19 09:41 GMT
ఇప్పటివరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ కారెక్కడంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేశాడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును నియమించారు. టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో బక్కని నరసింహులును నియమించారు.

తెలంగాణ టీడీపి నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులను నియమించారు. బక్కని నర్సింహులు చాలా కాలంగా  చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్నారు. ఈయన 1994-1997 వరకు షాద్ నగర్ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ..పార్టీ మారకుండా చంద్రబాబుకు, టీడీపీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నాడు. వివిధ నామినేటెడ్ పోస్టుల లోనూ నర్సింహులకు చంద్రబాబు అవకాశం ఇచ్చాడు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడిగా నర్సింహులును నామినేట్ చేశాడు. తెలుగుదేశం పార్టీలో జాతీయ కార్యదర్శి పదవి కూడా ఇచ్చాడు.

ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ టీడీపీని వదిలి టీఆర్ఎస్ లో చేరడంతో ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో చర్చలు జరిపారు. మొదట టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, కొత్త కోట దయాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల వారు ఈ పదవిని స్వీకరించడానికి నిరాకరించినట్టు తెలిసింది.

ఈ క్రమంలోనే షెడ్యూల్ కులాలకు చెందిన బక్కని నర్సింహులును సామాజిక కోణంలో చంద్రబాబు ఎంపిక చేసినట్టు తెలిసింది. బీసీల పార్టీ అయిన టీడీపీకి ఈయన ఎంపిక సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. ఇక  టీటీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నట్టు సమాచారం.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు దిగ్గజ నేతలంతా వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి, ఎల్.రమణ, ఎర్రబెల్లి, శ్రీహరి లాంటి వాళ్లు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చేరిపోయారు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇన్నాళ్లు ఉన్న ఎల్.రమణ  తాజాగా రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో ఆఖరి ఆశ కూడా తెలంగాణలో ఆవిరైపోయింది. తెలంగాణలోని తెలుగు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇక టీడీపీ తెలంగాణలో ఇన్నాళ్లు ఒంటరిగా పోటీచేయలేకపోయింది. అది కాంగ్రెస్ తో కలిసి గత ఎన్నికల్లో తలపడింది. ఎల్.రమణ రాజీనామాతో ఇప్పుటు రాష్ట్రంలో పూర్తిగా టీటీడీపీ దుకాణం మూసివేసినట్టైంది.

ఈ క్రమంలోనే టీడీపీ చీఫ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీని సజీవంగా ఉంచడానికి ఈ  ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాడట.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ సీట్లు గెలిచే అవకాశాలు పూర్తిగా లేవని తెలిసి కూడా.. అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా చంద్రబాబు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ టీడీపీ చీఫ్ పదవిని భర్తీ చేశారు.. చంద్రబాబు సైతం కుల సమీకరణాలు, ప్రజాదరణ, సినియారిటీ, కొత్త అధ్యక్షుడిని నియమించడానికి విధేయత వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నియామకం చేపట్టారు.

టీటీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా బక్కని నర్సింహులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నర్సింహులును అభినందించిన ఈ ఇద్దరు సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని కోరారు.
Tags:    

Similar News