2019లోనూ బాల‌య్య‌ది హిందూపుర‌మేన‌ట‌!

Update: 2017-06-26 04:29 GMT
టాలీవుడ్ అగ్ర న‌టుడు - అనంత‌పురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ రెండు - మూడు రోజులుగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో సంద‌డి చేస్తున్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత హిందూపురం వెళ్లిన బాల‌య్య‌కు అక్క‌డి టీడీపీ నేత‌లు - బాల‌య్య అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. మొన్న ప‌లు అభివృద్ధి కార్యక్ర‌మాల్లో పాలు పంచుకున్న ఆయ‌న నిన్న త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో దాదాపుగా మ‌మేక‌మ‌య్యార‌నే చెప్పాలి. ఇదంతా బాగానే ఉన్నా... హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా బాల‌య్య గెలిచి ఇప్ప‌టికే మూడేళ్లు దాటిపోయాయి. మ‌రో ఏడాదిన్న‌ర కాలం ఉంటే... ఆయ‌న మాజీ అయిపోతారు.

అయితే మాజీ ఎమ్మెల్యేగా మారేందుకు బాల‌య్య సుతారమూ ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఎందుకంటే ఒక్క‌సారి రాజ‌కీయం రుచి చూస్తే... ఇక దానిని వ‌దులుకోలేరు. ఈ మాట బాల‌య్య  విష‌యంలోనూ నిజ‌మైంద‌నే చెప్పాలి. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తాను పోటీ చేస్తాన‌ని బాల‌య్య చెప్పేశారు. అది కూడా త‌న‌ను అసెంబ్లీకి పంపిన హిందూపురం నుంచే  ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అయినా హిందూపురం నుంచే పోటీ చేస్తాన‌ని ఆయ‌న ఎందుకు చెప్పార‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... త‌న‌ను అసెంబ్లీకి పంపిన హిందూపురంలో ఇప్ప‌టికే ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాన‌ని, ఇక‌పైనా కొన‌సాగిస్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు.

ఇక్క‌డ అభివృద్ధి చేసి ఎక్క‌డికో పోయి ఓట్ల‌డిగితే ఏం బాగుంటుంద‌నుకున్నారో? ఏమో ?  తెలియ‌దు గానీ... చేసిన అభివృద్ధిని చూపించిన త‌ర్వాతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఓటు అడుగుతాన‌ని బాల‌య్య చెప్పుకొచ్చారు. ఇటీవ‌లే క‌ర్నూలు జిల్లా నంద్యాల వెళ్లిన బాల‌య్య బావ గారైన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కూడా ఇదే రీతిన మాట్లాడారు. తాను పింఛ‌న్లు ఇస్తున్నాన‌ని, రోడ్లు వేయిస్తున్నాన‌ని, రేష‌న్ స‌రుకులు ఇస్తున్నాన‌ని చెప్పిన చంద్రబాబు... ఇన్ని ప‌నులు చేస్తున్న త‌న‌కే ఓటు వేయాల‌ని ఆయ‌న అక్క‌డి ఓట‌ర్ల‌ను అడిగారు. మ‌రి బాల‌య్య‌కు కూడా త‌న బావ చెప్పిన మాట‌లు గుర్తుకు వ‌చ్చాయో, ఏమో తెలియ‌దు గానీ... తాను కూడా హిందూపురంలో లెక్క‌లేన‌న్ని అభివృద్ధి ప‌నులు చేశాన‌ని, ఆ ప‌నుల‌ను చూపెట్టే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్లు అడుగుతాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News