ఫలితాల వేళ బాలయ్య సెంటిమెంట్

Update: 2019-05-22 06:48 GMT
రాజకీయాల్లో, సినిమాల్లో సెంటిమెంట్స్ ఎక్కువ. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ‘మూడు అక్షరాల సినిమాల పేర్ల’ సెంటిమెంట్ ఉంది. ఇక బాలయ్యకు ‘సింహ’ అనే పేరు టైటిల్ లో ఉంటే అది గ్రాండ్ హిట్ అని నమ్ముతుంటారు. స్వతహాగానే బాలయ్యలో ఆధ్యాత్మికత ఎక్కువ. ఆయన తరుచుగా పూజలు - పునస్కారాలు - యాగాలు చేస్తుంటారు. తాజాగా తన గెలుపు కోసం కూడా 2014 నాటి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.

రేపు ఓట్ల లెక్కింపు. అందుకే బాలయ్య తను పోటీచేసిన అనంతపురం జిల్లాకు బయలు దేరారు. జిల్లాకేంద్రంలోని ఎస్కేయూలో ఈసారి కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 2014లోనూ ఇదే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో బాలయ్య స్థానిక ఆర్డీటీ స్టేడియంలోని 9వ నెంబర్ గదిలో బస చేశారు. అప్పుడు ఘనవిజయం సాధించారు. ఆ సెంటిమెంట్ కలిసిరావడంతో ఈసారి కూడా అదే ఫాలో కావాలని డిసైడ్ అయ్యారట..

ఇప్పుడు 2019 ఎన్నికల వేళ కూడా బాలయ్య అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడట.. ఎస్కేయూలోనే కౌంటింగ్ జరగడంతో ఈసారి కూడా ఆర్డీటీ స్టేడియంలోని 9వ నెంబర్ గది కోసం సంప్రదించాడట.. అక్కడ బుధవారం సాయంత్రం బస చేసి గురువారం కౌంటింగ్ కు హాజరు కావాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం అనంతపురం వస్తున్నారు.

అయితే బాలయ్య సెంటిమెంట్ తెలియని ఆర్డీటీ స్టేడియం నిర్వాహకులు మరొకరికి ఆ గదిని రేపటికి కేటాయించారట.. కానీ బాలయ్య కోరిక మేరకు ఆ గదిని ఖాళీ చేయించి తాజాగా రూమ్ నెంబర్ 9ను బాలయ్యకు కేటాయించారు. బుధవారం సాయంత్రం బాలయ్య ఇందులోనే బసచేసి రేపు కౌంటింగ్ జరిగే ఎస్కేయూలో పాల్గొంటారు. ఇలా పోయిన సారి హిందూపురంలో గెలిచిన సెంటిమెంట్ ను రెండోసారి గెలిచేందుకు బాలయ్య పునరావృతం చేస్తున్నారు. మరి సెంటిమెంట్ ఫలించి బాలయ్య గెలుస్తాడా లేదా అన్నది రేపు తెలుస్తుంది.


Tags:    

Similar News