పేకాడుతూ దొరికిపోయిన బాలకృష్ణ పీఏ?

Update: 2022-03-22 04:49 GMT
ఏపీ-కర్ణాటక సరిహద్దుల్లో పేకాట జోరుగా సాగుతోందన్న ఆరోపణలు చాలాకాలంగా వస్తున్నాయి. పోలీసులు పలుమార్లు దాడులు నిర్వహించినా...స్థావరాలను మారుస్తూ పేకాటరాయుళ్లు పోలీసుల వలకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో తాజాగా నేడు పేకాట స్థావరాలపై కర్ణాటక పోలీసులు దాడులు నిర్వహించారు. నగరిగేర ప్రాంతంలో 19 మంది రాజకీయ ప్రముఖులు, ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అయితే, అరెస్టయిన వారిలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీ, హిందూపురం వైసీపీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డి తదితరులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అరెస్టయిన 19 మందిని పోలీసులు చిక్కబళ్లాపూర్ లోని గుడిబండ కోర్టులో హాజరుపరిచారు. నగరిగేరలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో పేకాట ఆడుతూ వారంతా రెడ్ హ్యాండెండ్ గా పట్టుబడ్డారు.

అయితే వైసీపీ నేతలతో పాటు టీడీపీకి చెందిన వారు కలిసి పేకాడడం, పట్టుబడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ కేడర్ ను ముప్పుతిప్పలు పెడుతోన్న వైసీపీ నేతలతో బాలయ్య పీఏ పేకాట ఆడుతున్నారన్న ఆరోపణలపై స్థానిక టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

గత ఐదేళ్లుగా బాలయ్య పీఏగా బాలాజీ వ్యవహరిస్తున్నారు. గతంలో బాలయ్య పీఏగా ఉన్న శేఖర్ పై స్థానిక టీడీపీ నేతలు ఆరోపణలు చేయడంతో ఆయనను ఐదేళ్ల క్రితం బాలయ్య తొలగించారు. శేఖర్ స్థానంలో వచ్చిన బాలాజీపై కూడా హిందూపురం టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు.

వాటిని సర్దుబాటు చేసేందుకు బాలయ్య ప్రయత్నిస్తున్నారు. కానీ, ఈలోపే తాజాగా పేకాడుతూ  బాలాజీ పట్టుబడ్డారన్న వార్తలు రావడం చర్చనీయాంశమైంది.  ఒకవేళ, బాలాజీ పోలీసులకు పట్టుబడటం నిజమైతే బాలయ్య ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News