బాల‌య్య పీఏ హౌస్ అరెస్ట్‌..

Update: 2017-02-05 10:16 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు బావ‌మ‌రిది, టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ పీఏ వ్య‌వ‌హారం తారాస్థాయికి చేరింది. హిందూపురంలోని బాలకృష్ణ నివాసంలో పీఏ శేఖర్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. అనవ‌స‌ర వివాదాలు త‌లెత్త‌కుండా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పోలీసులు వివ‌రించారు. కాగా ఈ హౌస్ అరెస్టుతో బాలకృష్ణ పీఏ విషయంలో నెలకొన్న వివాదం మరింత చర్చనీయాంశమైంది. నిన్నమొన్నటి వరకూ నియోజకవర్గానికి, అనంతపురం జిల్లాకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాకింది. ఎమ్మెల్యేగా బాలయ్య ప్ర‌జా సంక్షేమాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.

హిందూపురం టీడీపీ రాజకీయం చిలికిచిలికి గాలివానలా మారింది. పీఏ శేఖర్ ను తప్పించకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని టీడీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బాలకృష్ణకు స్పష్టం చేశారు. అస‌మ్మ‌తి నేత‌ల అభిప్రాయం ప్ర‌కారం అధికార పార్టీ నాయకులైనా పీఏకు కమీషన్‌ ఇచ్చుకోవాల్సిందే. హిందూపురంలో రోడ్డుపై బడ్డీకొట్టు వాళ్లతోనూ పీఏ శేఖ‌ర్‌ మాముళ్లూ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తోన్నాయి. ఈ విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులు బాలయ్య దృష్టికి తీసుకెళ్లినా ఆయన పెద్దగా పట్టించుకోనట్లు తెలిసింది. తాజాగా ఇటీవల పీఎ శేఖర్‌ చర్యలను జీర్ణించుకోలేక కొంతమంది సీనియర్‌ నాయకులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. సమస్యను మరోమారు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఇంతలో అక్కడుండే మరో సీనియర్‌ నాయకులు, బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రంగ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి బాలకృష్ణకు తెలియకుండా సమావేశాలు పెడితే చర్యలుంటాయని హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ఈ హెచ్చ‌రిక‌ల అనంత‌రం పీఏను వెంట‌నే తొల‌గించాల‌ని టీడీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News