లోకేశ్ ఎమ్మెల్సీ గిరీకి బాల‌య్య మ‌ద్ద‌తిచ్చారుగా!

Update: 2017-03-01 05:28 GMT
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ త్వ‌ర‌లోనే ఏపీ శాస‌నమండలిలో అడుగుపెట్ట‌నున్నారు. ఇందుకోసం ఆ  పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప‌క్కాగా ర‌చించిన ప‌థ‌కానికి ఇటీవ‌లి పొలిట్ బ్యూరో భేటీ ఆమోద ముద్ర వేసింది. అయితే అధికార పార్టీకి చెందిన కీలక నేత‌గా ఉన్న లోకేశ్ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల ద్వారా కాకుండా ప‌రోక్ష ఎన్నిక‌ల ద్వారా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగుపెట్ట‌డ‌మా? అంటూ వివిధ ప‌క్షాలు విమ‌ర్శ‌లు సంధిస్తున్నాయి. ద‌మ్మూ - ధైర్యం ఉంటే లోకేశ్ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెల‌వాల‌ని వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు స‌వాల్ కూడా విసిరారు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో నిల‌బ‌డితే ఓట‌మి త‌ప్ప‌ద‌న్న భ‌యంతోనే చంద్ర‌బాబు త‌న కుమారుడిని పరోక్ష ఎన్నిక‌ల ద్వారా చ‌ట్ట‌స‌భ‌లోకి ఎంట్రీ ఇప్పిస్తున్నాడ‌ని కూడా అంబ‌టి సెటైర్లేసిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో లోకేశ్ ఎమ్మెల్సీగిరీపై టీడీపీ నేత‌లు కూడా మాట్లాడ‌టం మొద‌లెట్టారు. లోకేశ్ ఎమ్మెల్సీ ప‌ద‌వికి అన్ని విధాలా అర్హుడంటూ కొత్త ప‌ల్లవి అందుకున్నారు. ఇదే స‌మ‌యంలో లోకేశ్ మామ‌, టాలీవుడ్ టాప్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ కూడా నిన్న లోకేశ్ ఎమ్మెల్సీగిరీపై స్పందించారు. నిన్న అమ‌రావ‌తి వెళ్లిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన బాల‌య్య‌... పలు అంశాల‌తో పాటు లోకేశ్ ఎమ్మెల్సీ గిరీపై ఓ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. ఎమ్మెల్సీ ప‌ద‌వికి లోకేశ్ అన్ని విధాలా అర్హుడ‌ని బాల‌య్య అన్నారు. క‌ష్ట‌ప‌డే వాళ్ల‌కే టీడీపీలో గుర్తింపు ఉంటుంద‌ని చెప్పిన బాల‌య్య‌... పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు సంద‌ర్భంగా లోకేశ్ చేసిన క‌ష్టాన్ని బాల‌య్య  ప్ర‌స్తావించారు.

అల్లుడిపై బాల‌య్య చేసిన కామెంట్ల విష‌యానికి వ‌స్తే... ఆయ‌న క‌ష్ట‌ప‌డుతున్నాడు. క‌ష్ట‌ప‌డే వాళ్ల‌కే పార్టీలో గుర్తింపు ఉంటుంది. ఎన్నిక‌ల మేనిఫెస్టో త‌యారీ సంద‌ర్భంగానే కాకుండా పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు స‌మ‌యంలోల‌నూ లోకేశ్ బాగా క‌ష్ట‌ప‌డ్డాడు అని బాల‌య్య వ్యాఖ్యానించారు. ఎతావ‌తా తన అల్లుడు లోకేశ్ త్వ‌ర‌లోనే శాస‌న‌మండ‌లిలో అడుగుపెడుతున్న విష‌యంపై ఎలాంటి రాద్ధాంతం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని బాల‌య్య చెప్పుకొచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News