బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు బద్దలు..ఈసారి ఎంతంటే?

Update: 2019-09-12 06:46 GMT
వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్ మహానగరం మొత్తం ఎంత సందడిగా మారుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వేలాదిగా పందిళ్లు వేసి.. వినాయక విగ్రహాల్ని పెట్టినా.. ఖైరతాబాద్ గణేషుడి విగ్రహానికి.. బాలాపూర్ విగ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.

అంతేకాదు.. నిమజ్జనానికి ముందు స్వామివారి ప్రసాదంగా ఉంచిన లడ్డూను వేలం వేయటం.. భారీగా ధర పలటం గత కొన్నేళ్లుగా వస్తున్నదే. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం గత రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఈసారి రికార్డు స్థాయిలో లడ్డూ వేలం వెళ్లి రూ.17.60 లక్షలకు సొంతం చేసుకున్నారు.

కొలన్ రామ్ రెడ్డి ఈసారి బాలాపూర్ లడ్డూను రూ.17.60 లక్షలకు సొంతం చేసుకోగా.. గత ఏడాది కంటే ఈసారి లక్ష రూపాయిలు అదనంగా ధర పలికింది. లడ్డూ వేలం పాటలో ఈ ఏడాది 28 మంది పాల్గొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలాన్ని కొన్ని టీవీ ఛానళ్లు లైవ్ టెలికాస్ట్ చేశాయి. 2018లో నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.16.60 లక్షలకు బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా సొంతం చేసుకోగా.. అంతకు ముందు ఏడాది (2017) నాగం తిరుపతి రెడ్డి రూ.15.60 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.

ఈ లడ్డూ వేలం 1994లో స్టార్ట్ అయ్యింది. మొదటిసారి వేలం వేసినప్పుడు రూ.450 లకు కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. అప్పటి నుంచి లడ్డూ  వేలం బాగా ప్రాచుర్యం పొందటమే కాదు.. లక్షలాది రూపాయిలు వెచ్చింది మరీ సొంతం చేసుకోవటానికి పలువురు పోటీ పడుతుంటారు.



Tags:    

Similar News