మాది గుడుంబా పార్టీ...మీది చీప్ లిక్క‌ర్ పార్టీ

Update: 2017-02-26 05:20 GMT
రాజ‌కీయాల్లో ప‌రుష‌మైన ప‌దాలు ఉప‌యోగించే వారి సంఖ్య‌ రోజురోజుకు పెరుగుతోంది. సీఎం కేసీఆర్  మ‌హ‌బూబాబాద్ జిల్లా కురవి వీరభద్రస్వామి దర్శనం సందర్భంగా కాంగ్రెస్ పార్టీని, నాయకులను చీప్‌ లిక్కర్‌ తో పోల్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర మాజీ మంత్రి - కాంగ్రెస్ సీనియర్ నేత పోరిక బలరాం నాయక్ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ది గుడుంబా పార్టీనా అని ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడు నెలల్లోనే చీప్‌ లిక్కర్ ప్రవేశపెట్టాలని చూసిన ముఖ్యమంత్రి చీప్ బుద్ధి అప్పుడే తెలిసిందని బలరాంనాయక్ కౌంటర్ అటాక్ చేశారు. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రయతాన్ని మానుకున్నారని ఆయన చెప్పారు. పొద్దంతా తాగే వారికే ఇలాంటి చీప్‌ లిక్కర్ మాటలు వస్తాయని ఆయన ధ్వజమెత్తారు.

తమ పార్టీ నాయకులను దొంగల ముఠాగా పోల్చిన ముఖ్యమంత్రి పార్టీ టీఆర్‌ ఎస్ అలీబాబా నలుగురు దొంగల మూఠా అని బ‌ల‌రాం నాయ‌క్ ఆరోపించారు. ఆంధ్రా నాయకులకు మూటలు మోసింది తాము కాదని, మిషన్ భగీరథ పేరుతో ఆంధ్రా కాంట్రాక్టర్‌ లకు కాంట్రాక్ట్ పనులు అప్పగించి మూటలు మోసేది నీవు కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే దళిత - గిరిజన - మైనార్టీలను మోసం చేసిన ముఖ్యమంత్రి తాజాగా వారి ఖాతాలోనే బీసీలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎంబీసీకి ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించి వెయ్యి కోట్లు కేటాయిస్తాననడం పచ్చి మోసమని ఆయన అన్నారు. దళితులకు ఇచ్చిన మూడెకరాల భూమి - గిరిజన - మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్‌ ల అమలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి మోసపూరిత హామీలతో ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తావని ప్రశ్నించారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా గొర్రెలు - చేపలు అంటు దాటవేసే ధోరణి సరికాదన్నారు.

ఇతర పార్టీల నుండి గెలిచిన 24 మంది ఎమ్మెల్యేలను మభ్యపెట్టి టీఆర్‌ ఎస్‌ లోకి తీసుకున్న కేసీఆర్‌ కు దమ్ము - ధైర్యం ఉంటే వారితో రాజీనామా చేయించి మళ్లి గెలవాలని బ‌ల‌రాం నాయ‌క్‌ సవాల్ విసిరారు. తమ నాయకులను సన్నాసులతో పోల్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ - ఆయన మంత్రులు - ఎమ్మెల్యేలే సన్నాసులని ఆయన అన్నారు. 40 ఏళ్ల అధికారంలో ఉండి కూడా తాము ఏమీ చేయలేదన్న కేసీఆర్ గడిచిన 10 సంవత్సరాల అభివృద్ధి, టీఆర్‌ ఎస్ మూడేళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనన్నారు. బహిరంగ చర్చకు ఎక్కడికి రావా లో నిర్ణయించి చెప్పాలని సవాల్ విసిరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News