తల్లి ఎవరికైనా తల్లే... అంటుంటారు కానీ... ఉగ్రవాదుల విషయంలో అది వర్తించదు. ఉగ్రవాదులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసేయడంతో ఓ తల్లి కళ్లు ఆనందంతో నిండిపోయాయి! ఆ తల్లి కడుపు కోతకు కారణమైన వాడి చావు వార్త ఆమెలో కొత్త ఆనందాల్ని నింపింది! వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది వికారుద్దీన్ తో పాటు మరో నలుగురు ఉగ్రవాదులు హతమవడంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంటే... మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గంగాపురం గ్రామస్థులు మరింత హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివెనక ఉన్న అసలు కథ ఏంటంటే... హైదరాబాద్ లోని ఫలక్ నుమా వద్ద 2009లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో గంగాపురానికి చెందిన హోంగార్డు బాలస్వామి చనిపోయారు. చేతికందొచ్చిన కొడుకు చనిపోవడంతో బెంగపెట్టుకున్న తండ్రి ఏడాదిలోపే చనిపోయాడు. ఇక ఒంటరిగా మిగిలి గంగవరంలో నివసిస్తున్న బాల స్వామి తల్లి తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ పై తన హర్షాన్ని ప్రకటించింది. "ఉగ్రవాదులు నా బిడ్డను పొట్టన పెట్టుకొన్నారు... మా కుటుంబం నాశనమయ్యింది... ఉగ్రవాది వికారుద్దీన్ చావడం వల్ల నా బిడ్డ ఆత్మకు శాంతి కలిగింది" అని పేర్కొంది. ఉగ్రవాదుల రాక్షస క్రీడలకు ఇటువంటి తల్లులు ఎందరో కన్నీరు పెట్టుకోవడం, ఎన్నో కుటుంబాన్లు చిన్నాభిన్నం అయిపోవడం మన దేశంలో సర్వసాధారణమైపోయింది. అయితే ఉగ్రవాదంపై మరింతగా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది!