ఒక చోటే పోటీ : డ్యూయల్ రోల్ కుదరదమ్మా ..?

Update: 2022-06-18 05:31 GMT
రాజకీయ నాయకుడు సాధారణంగా రెండేసి చోట్ల పోటీ చేస్తూ ఉంటారు. తమ గెలుపు మీద డౌట్ ఉంటే ఇలా చేస్తారు. ఇక పార్టీల అధినేతలు అయితే తమ విశేష జనాకర్షణతో అన్ని ప్రాంతాల నుంచి జనాల  ఫోకస్ తమ వైపు ఉండేలా చేసుకోవడానికి రాజకీయ లాభాల కోసం ఎక్కువ చోట్ల నుంచి పోటీకి దిగుతూంటారు. అయితే 1996లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించడం వల్ల రెండు కంటే ఎక్కువ చోట్ల పోటీకి ఆస్కారం లేకుండా పోయింది.

అంతకు ముందు ఎన్టీయార్ లాంటి వారు మూడు ప్రాంతాలు అంటూ మూడు చోట్ల పోటీ చేసి గెలిచారు. ఇక 2004లో చూస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని సెక్షన్ల సవరణకు ఈసీ ప్రతిపాదించింది. దాని ప్రకారం చూస్తే ఒక వ్యక్తి ఒక చోట మాత్రమే పోటీ చేయాలని  రెండవ చోట పోటీకి దిగరాదని సూచించింది.

ఈ చట్ట సవరణ చేయకపోతే కనీసం రెండు చోట్ల పోటీ చేసి గెలిచి తరువాత ఉప ఎన్నికలకు కారణం అవుతున్న వ్యక్తి నుంచి భారీ జరీమానా అయినా వసూల్ చేయాలని ప్రతిపాదించింది.

అలా పార్లమెంట్ కి అయితే పది లక్షలు, అసెంబ్లీకి అయితే అయిదు లక్షల రూపాయలు జరీమానా వసూల్ చేయలని ప్రతిపాదించింది. అయితే ఇది అలాగే ఉండిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇపుడు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ఒకచోటే పోటీకి అభ్యర్ధులను కట్టడి చేయాలని కేంద్రాని గట్టిగా కోరుతోంది. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేయాలని కూడా సూచిస్తోంది.

ఈ మధ్యనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో భేటీ అయి ఈ మేరకు ప్రతిపాదించారు. ఇలా ఎక్కువ చోట్ల పోటీ చేస్తూ ఉప ఎన్నికలకు దారి తీసే పరిస్థితులు కల్పిస్తున్నారని, చట్టాన్ని సవరించాలని, లేకపోతే భారీ జరీమానాలు అయినా అలాంటి వారి మీద విధించాలని కోరుతోంది. మరి దీని మీద కేంద్రం కూడా సీరియస్ గా ఆలోచన చేస్తోంది అంటున్నారు. 2024 నాటికి ఈ సవరణకు అమలు అవుతాయని కూడా చెబుతున్నారు.

అదే జరిగితే తొందరలోనే ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణకు ఖాయం. అపుడు డ్యూయల్ రోల్స్ వేసే నాయకులకు చెల్లు చీటి రాసేసినట్లే.  ఎవరైనా  సరే వీరుడిగా ధీరుడిగా ఒక చోటనే పోటీ చేయాలి. చావో రేవో అక్కడే తేల్చుకోవాలి. మరి మన నాయకులకు ఇది ఇబ్బందికరమే  కద్దా. కానీ జనాలకు మాత్రం మంచి చేసేది. ఎన్నికల వ్యయాని కూడా తగ్గించేసేది. కాబట్టి రెండు చోట్ల పోటీని నిషేధించాలని మేధావులు,  సగటు  జనాల నుంచి కూడా డిమాండ్ వస్తోంది.
Tags:    

Similar News