వారికి లిఫ్ట్ లు.. వీరికి తేనెటీగలు

Update: 2015-08-31 03:55 GMT
వ్యక్తులకు కలిసిరానివి కొన్ని ఉంటాయని నమ్ముతుంటారు. మరి.. ఇలాంటివి రాజకీయ పార్టీలకూ ఉంటాయా? అంటూ తరచూ చోటు చేసుకుంటున్న సీన్లు చూస్తుంటే.. అవునేమో అనిపించక మానదు. మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కేంద్రంలో పాగా వేసిన బీజేపీ.. తెలంగాణ రాష్ట్ర అధికార పక్షం రెండింటికి కొత్త శత్రువులు మొదలయ్యారు.

తమ రాజకీయ ప్రత్యర్థులకు మాటలతో చుక్కలు చూపించే ఈ రెండు పార్టీల నేతలు.. కొన్నింటి విషయంలో మాత్రం తీవ్రంగా భయపడుతున్నారు. తెలంగాణ అధికారపక్షం టీఆర్ ఎస్ సంగతే చూస్తే.. వారికి తేనెటీగలు అంటే మా చెడ్డ భయం. అదేం చిత్రమో కానీ.. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన బడా నేతలు.. పాల్గొనే కార్యక్రమాల్లో తేనెటీగలు ఇప్పటికే పలుమార్లు దాడి చేశాయి. అదృష్టవశాత్తు ఆ దాడి నుంచి టీఆర్ ఎస్ అగ్ర నేతలు సేఫ్ గా తప్పించుకున్నారు. ఒకానొక దశలో అయితే.. టీఆర్ ఎస్ అగ్ర నేతలు పాల్గొనే కార్యక్రమాల చుట్టుపక్కల ప్రాంతాల్లో తెనేచుట్లు ఏమైనా ఉన్నాయా? అని చూసుకునే వారన్న మాట వినిపించేది.

తాజాగా.. కమలనాథులకు కొత్త కష్టం వచ్చి పడింది. ఆ పార్టీకి చెందిన కీలకనేతలు ఎక్కిన లిఫ్ట్ లు మధ్యలో మొరాయిస్తున్నాయి. బీజేపీ నేతలకూ.. వారికి సెక్యూరిటీ ఇచ్చే సిబ్బందికి ముచ్చెమటలు పోయిస్తున్నాయి. ఆ మధ్య బీహార్ కు వెళ్లిన బీజేపీ అధినేత అమిత్ షా లిఫ్ట్ లో ఇరుక్కుపోవటమే కాదు.. ఓ పట్టాన లిఫ్ట్ తలుపులు తెరుచుకోని పరిస్థితి. దీంతో.. లిఫ్ట్ తలుపులు బద్ధలు కొట్టి మరీ ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. ఈ లిఫ్ట్ ఉదంతం గురించి పూర్తిగా మర్చిపోకముందే.. అలాంటి ఘటనే మరొకటి తాజాగా చోటు చేసుకుంది.

హైదరాబాద్ లోని కాచిగూడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందదుకు వెళ్లిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. మొదట బాగానే పని చేసిన.. లిఫ్ట్ కదిలిన కాసేపటికే ఆగిపోవటంతో.. సెక్యూరిటీ మొదలు.. సిబ్బంది వరకూ అంతా ఉరుకులు పరుగులు పెట్టారు. తలుపులు బద్ధలు కొట్టకుండానే.. లిఫ్ట్ డోర్లు తెరుచుకోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

తాము ఏర్పాటు చేసే కార్యక్రమాల దగ్గర తేనెటీగల విషయంలో గులాబీ దళం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో.. అలాంటి జాగ్రత్తలే లిఫ్ట్ విషయంలో కమలనాథులు తీసుకుంటే మంచిదేమో.
Tags:    

Similar News