కేసీఆర్‌ పై బీజేపీ నేతలకు ప్రేమ కారిపోతోందోచ్

Update: 2015-10-19 04:20 GMT
ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై బీజేపీ జాతీయ స్థాయి నేతలు ప్రశంసలు కురిపించే కాలం ఆసన్నమైంది. స్థానిక బీజేపీ నేతలు కిషన్ రెడ్డి - లక్ష్మణ్‌ లను ఇది మహా ఇబ్బంది పెట్టడం నిజమే అయినప్పటికీ కేంద్ర స్థాయినేతలకు మరొక మార్గం లేకుండా పోతోంది మరి. బలహీన వర్గాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వడంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్‌ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. మరోవైపు వెంకయ్య వంటి సీనియర్ మంత్రులు - బీజేపీ నేతలు కూడా కేసీఆర్‌ ను ప్రశంసించడానికి సిద్ధపడిపోయారు.

కేంద్రం కూడా అందరికీ ఇళ్లు పథకాన్ని ప్రారంభిస్తోందని ఆదివారం ప్రకటించిన వెంకయ్యనాయుడు - కేంద్ర రాష్ట్రాలు సంయుక్తంగా కృషి చేస్తేనే ఇళ్ల నిర్మాణం వంటి భారీ పథకాలు విజయవంతమైతాయని ముక్తాయించారు. ఆ మార్గంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పిన వెంకయ్య, 2022 నాటికి పేదలకు ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించారు.

అసలు విషయం ఏదంటే తెలంగాణ రాష్ట సమితిని ఎన్డీయే కూటమిలోకి లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సమాచారం. ఇప్పుడు కాకుంటే 2019 నాటికైనా టీఆరెస్‌ ను తన కూటమిలోకి చేర్చుకోవాలన్నది బీజేపీ తపన. ఎన్డీయే కూటమి వచ్చే ఎన్నికల్లో కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే తెలంగాణలో శక్తివంతమైన మిత్రపక్షం దానికి అవసరం. టీఆరెస్‌ కు మించిన బలమైన మిత్రపక్షం లేదని బీజేపీ వర్గాల అభిప్రాయం.

ఏతావతా చూడబోతే.. భాజపా వచ్చే ఎన్నికల సమయానికి ద్వంద్వ వ్యూహంతో ముందుకు వెళ్లే లా కనిపిస్తోంది. అనగా.. ఏపీలో తెదేపా మైత్రి.. తెలంగాణలో తెరాసతో బంధం.. అనగా ఇక్కడ మాత్రం తెదేపాతో వైరం.. ప్రస్తుతానికి ఇది వ్యూహం కావచ్చు గానీ.. రాబోయే మూడున్నరేళ్లలో ఎలా మారుతుందో ఏమో...?
Tags:    

Similar News