కేసీఆర్ మాట‌కు కౌంట్ ఇచ్చిన ఒకేఒక్క‌డు

Update: 2017-08-06 16:54 GMT
దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. చాలామందే ముఖ్య‌మంత్రులు ఉన్నారు. కానీ.. వారెవ‌రికీ అనిపించ‌ని నొప్పి తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు క‌లిగింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్రాజెక్టుల నిర్మాణంపై 12 శాతం జీఎస్టీ విధించ‌టాన్ని దేశంలో మ‌రే ముఖ్య‌మంత్రి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాదిరి తీవ్రంగా విరుచుకుప‌డింది లేదు.

ప్రాజెక్టుల‌పై విధించే జీఎస్టీని 12 శాతాన్ని తీసివేయాల‌ని కేసీఆర్ అండ్ కో ఎంత భారీగా డిమాండ్ చేస్తున్న‌దే తెలిసిందే. ఓప‌క్క ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ క‌లిసి పిటీష‌న్లు పెట్ట‌ట‌మే కాదు.. ప్ర‌ధాని మోడీని ప‌ర్స‌న‌ల్ గా క‌లిసి మ‌రీ జీఎస్టీ ముచ్చ‌ట గురించి చెప్పుకొచ్చారు.

జీఎస్టీలో ప్రాజెక్టుల‌కు 12 శాతం జీఎస్టీని వేయ‌టం కార‌ణంగా ఒక్క తెలంగాణ రాష్ట్ర సర్కారు మీద‌నే దాదాపు రూ.19వేల కోట్ల‌కు పైనే భారం ప‌డుతుంద‌ని చెబుతున్నారు. అందుకే.. జీఎస్టీని ప్రాజెక్టుల నిర్మాణం మీద విధించ‌కుండా వెనువెంట‌నే నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం మీద‌నే జీఎస్టీ కార‌ణంగా రూ.19వేల కోట్ల భారం ప‌డితే.. మిగిలిన అన్నీ రాష్ట్రాల మీద ఎంత భారం పడుతుందో లెక్కేస్తే అంకెలు దిమ్మ తిరిగిపోతాయి. కేంద్రానికి బంగారు బాతుగుడ్డు మాదిరి పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఇచ్చేందుకు వీలుగా ఇప్ప‌టి నిర్ణ‌యం ఉంది. అయితే.. దీని వ‌ల్ల రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా తింటుంద‌న్న‌ది కేసీఆర్ వాద‌న‌. ఇందులో భాగంగా నిన్న (శ‌నివారం) ప్రెస్ మీట్ పెట్టి మోడీ స‌ర్కారు మీద తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం తెలిసిందే.

జీఎస్టీ మీద చాలామందికి చాలానే ఆవేద‌న ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. కేంద్ర స‌ర్కారు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

అధికార‌ప‌క్షానికి చెందిన అధినేత‌ల‌పై ఇంత భారీగా విరుచుకుప‌డినా.. తెలంగాణ బీజేపీ నుంచి కేసీఆర్ మాట‌ల‌కు చెక్ పెడుతూ కౌంట‌ర్ వ్యాఖ్య‌లు ఎవ‌రైనా చేశారా? అంటే అలాంటిదేమీ క‌నిపించ‌దు. మోడీ స‌ర్కారు మీద నేరుగా ఇంత తీవ్రంగా విరుచుకుప‌డినా.. ఎవ‌రూ చ‌ప్పుడు చేయ‌కుండా ఉండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించేదే. ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీ సీనియ‌ర్ నేత‌.. కేంద్ర స‌హాయ‌మంత్రి అయిన బండారు ద‌త్తాత్రేయ రియాక్ట్ అయ్యారు.

కేసీఆర్ వ్యాఖ్య‌ల్ని త‌ప్పు ప‌ట్టారు. తెలంగాణ‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టుల‌పై కేంద్రం తీసుకున్న 12 శాతం జీఎస్టీ ఏక‌ప‌క్ష నిర్ణ‌యం కాద‌న్నారు. కేసీఆర్ విమ‌ర్శ‌ల్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రం ఎప్పుడూ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకోద‌న్నారు. అన్ని రాష్ట్రాలు అనేక‌సార్లు స‌మావేశాలు నిర్వ‌హించిన త‌ర్వాతే జీఎస్టీని అమ‌ల్లోకి తెచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఈ అంశంపై న్యాయ‌పోరాటం చేస్తాన‌ని కేసీఆర్ వ్యాఖ్యానించ‌టం స‌రికాద‌న్న ద‌త్త‌న్న‌.. జీఎస్టీ త‌గ్గుతుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. సొంతోళ్ల మీద‌నే తెలంగాణ సీఎం కేసీఆర్ విమ‌ర్శ‌లు చేసిన‌ప్ప‌టికీ ద‌త్త‌న్న మిన‌హా పెద్ద‌గా ఎవ‌రూ రియాక్ట్ కాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News