మాజీ మంత్రికి చేతి నిండా పని.. జగన్ పుణ్యమేనట...?

Update: 2022-02-14 23:30 GMT
విశాఖ జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇపుడు ఫుల్ బిజీ అయ్యారు. ఆయన గత కొన్ని రోజులుగా తీరుబాటు లేకుండా ఉన్నారు. ఒక వైపు పార్టీ నాయకులతో మీటింగ్స్, మరో వైపు అఖిల పక్ష నేతలతో భేటీలు, ఇంకో వైపు ఆందోళనలు,  ఆ మీదట మీడియా సమావేశాలు ఇలా ఆయన తెగ దూకుడు చేస్తున్నారు. ఒక్కసారిగా ఆయన జోరందుకోవడానికి కారణం జగన్ సర్కార్ తీసుకువచ్చిన కొత్త జిల్లాల ప్రతిపాదన. ఆ నోటిఫికేషన్ తో అంతా అటూ ఇటూగా మారిపోయింది.

దాంతో బండారు సత్యనారాయణమూర్తి తన రాజకీయానికి పదును పెట్టారు. పెందుర్తిని విశాఖ జిల్లా నుంచి తీసుకెళ్ళి అనకాపల్లిలో కలిపేయడం పట్ల బండారు గుస్సా అవుతున్నారు. ఇది కచ్చితంగా జగన్ చేసిన కుట్ర అంటున్నారు. విశాఖ అభివృద్ధి చెందకుండా వేసిన ప్లాన్ అని కూడా గట్టిగా మాట్లాడుతున్నారు.

విశాఖకు సమీపంలో ఉన్న పెందుర్తికి సీపీ ఆఫీస్ దగ్గర కానీ ఎస్పీ అఫీస్ ఎక్కడో ఉన్న అనకాపల్లిలో కలిపిస్తే ఎలా అని అంటున్నారు. ఇక పెందుర్తివాసులు తెల్లారి లేస్తే విశాఖకు రాకపోకలు సాగిస్తారని, అలాంటిది వారు ప్రతి చిన్న పని కోసం అనకాపల్లి వెళ్లాలా అని లాజిక్ పాయింట్ తీశారు. పెందుర్తిని విశాఖలో కలపకపోతే మాత్రం అతి పెద్ద ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు.

పెందుర్తి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా అదీప్ రాజ్ గెలిచారు. ఆయన యువకుడు. పెందుర్తిని అనకాపల్లిలో కలపడం పైన వినతిపత్రం ఇచ్చి ఊరుకున్నారు. దాంతో ఇపుడు అటూ ఇటూ కూడా తానే అయి బండారు చేస్తున్న పొలిటికల్ సౌండ్ విశాఖ రాజకీయాల్లో చర్చగా మారింది. బండారు ఈ డిమాండ్ చేయడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు.

రేపటి రోజున టీడీపీ అధికారంలోకి వస్తే జిల్లాకో మంత్రి అన్న లెక్కన పదవులు ఇస్తుంది. పెందుర్తిని తీసుకెళ్ళి అనకాపల్లిలో కలిపితే రూరల్ జిల్లాలో పెద్ద పోటీ ఉంటుంది. అక్కడ అయ్యన్నపాత్రుడు వంటి వారు ఉన్నారు. దాంతో పాటు జిల్లా రాజకీయాల్లో పెత్తనం చేయడానికి కూడా వీలు ఉండదు. ఇలా అన్ని రకాలుగా ఆలోచించిన బండారు ప్రజల మేలు కోసం  పెందుర్తి విశాఖలో ఉండాలని కోరుకుంటున్నారు.

ఒక విధంగా ఆయన బాగా యాక్టివ్ అయ్యారు. తన మీద ముప్పై వేల పై చిలుకు మెజారిటీతో అదీప్ రాజ్ గెలవడంతో ఇన్నాళ్ళూ సైలెంట్ అయిన బండారు ఇపుడు మాత్రం కొత్త జిల్లాల విభజనను ముందు పెట్టి జోరు పెంచేశారు. అడ్డ గోలు విభజనను తాము అంగీకరించే ప్రసక్తే లేదని కూడా అంటున్నారు. దీంతో డిఫెన్స్ లో పడిన వైసీపీ నేతలు బయటకు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఈ రకంగా అసంబద్ధ విభజన మీద వారు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారు.
Tags:    

Similar News