బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి కి నిర‌స‌న సెగ‌..న‌డిరోడ్డుపై కాన్వాయ్ అడ్డుకొని..సారీ చెప్పాల‌ని డిమాండ్

Update: 2021-03-17 16:30 GMT
రాజ‌కీయంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూ.. వార్త‌ల్లో నిలుస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కు నిర‌స‌న సెగ త‌గిలింది. హైద‌రాబాద్ నుంచి సూర్యాపేట జిల్లా కోదాడ బ‌య‌లు దేరిన ఆయ‌న‌ను సూర్యాపేటలో స్వేరోస్ స‌భ్యులు అడ్డుకున్నారు. గురుకుల విద్యాల‌యాల కార్య‌ద‌ర్శి ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పై చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

గ‌త సోమ‌వారం ‌పెద్ద‌ప‌ల్లి జిల్లా జూప‌ల్లి మండ‌లం ధూళిక‌ట్ట వ‌ద్ద బుద్దుడి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఓ కుటుంబం 'హిందూ దేవ‌త‌ల మీద త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌ని, మేము దేవుని అవ‌తారాల‌ను, సిద్ధాంతాల‌ను న‌మ్మ‌ము గాక న‌మ్మము' అంటూ ప్రతిజ్ఞ చేసింది. ఈ సంద‌ర్భంగా తీసిన వీడియోలో ప్ర‌వీణ్ కుమార్ కూడా ఉన్నారు.

దీంతో.. హిందూ దేవుళ్ల‌కు వ్య‌తిరేకంగా ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, స్వేరోస్ పేరుతో ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. దీనికి రాజ‌కీయ అంశాల‌ను కూడా క‌లిపిన సంజ‌య్‌.. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే ఇవ్వ‌న్నీ జ‌రుగుతున్నాయంటూ ఆరోప‌ణ‌లు చేశారు.

కాగా.. అది ఒక కుటుంబం చేసిన‌ ప్ర‌తిజ్ఞ అని, దానికి స్వేరోస్ కు సంబంధం లేద‌ని ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఉద్దేశ‌పూర్వ‌కంగా బండి సంజ‌య్ ప్ర‌వీణ్ కుమార్ ను అవ‌మానించార‌ని, వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో ఉద్రిక్త‌త చోటు చేసుకోవ‌డంతో ఆయ‌న తిరిగి హైద‌రాబాద్ ప‌య‌న‌మ‌య్యారు.
Tags:    

Similar News