కేసులకు భయపడే ప్రసక్తే లేదు .. సీఎం పై నిప్పులు చెరిగిన బండి సంజయ్ !

Update: 2020-11-28 13:50 GMT
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో అన్ని పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. ముఖ్యంగా ఎంఐఎం, బీజేపీ, టిఆర్ ఎస్ నేతల మధ్య వ్యాఖ్యలు కోటలు దాటుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ అధినేత బండి సంజయ్ దూకుడు కనబరుస్తున్నారు. మరోసారి ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని తనపై కేసులు పెట్టారని చెప్పారు. కేసులకు, రిమాండ్‌లకు భయపడే సమస్యే లేదన్నారు.

పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చివేస్తామని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడితే సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్ వెంటనే స్పందిస్తే తాను మాట్లాడేవాడిని కాదని అన్నారు. టీఆర్ ఎస్ నేతలకు ఎన్నికలప్పుడే జనాలు గుర్తుకువస్తారని విమర్శించారు. కరోనావ్యాక్సిన్ ‌పై సమీక్షకు ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్నారని, తనను పిలవలేదని సీఎం కేసీఆర్ అంటున్నారని, మరి ఇన్ని రోజులు ఆయన ఎం చేశారని ప్రశ్నించారు. వరదల సమయంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ లోనే బాధితులను పరామర్శించలేదని విమర్శించారు. అప్పుడు ప్రగతి భవన్, ఫామ్‌ హౌస్‌ ల్లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఓట్ల కోసం ఇదే హైదరాబాద్‌ లో సభ పెడుతున్నారని మండిపడ్డారు.

ఇంట్లో చెప్పే వచ్చానని, చావుకు భయపడేది లేదన్నారు. ట్యాంక్‌ బండ్‌ విగ్రహాలను టచ్‌ చేస్తే కచ్చితంగా దారుసలాంను కూల్చేస్తామని మరోసారి బండి సంజయ్‌ హెచ్చరించారు. ఎక్కువ రోజులు నిలబడని ప్రభుత్వానికి పోలీసులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావట్లేదన్నారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలన్నారు. ఇక, డిసెంబర్ 1వ తేదీన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Tags:    

Similar News