బండి సంజ‌య్ పోటీ చేసేది అక్క‌డి నుంచేనా..!

Update: 2022-04-01 01:30 GMT
తెలంగాణ‌లో బీజేపీని బ‌లోపేతం చేసేందుకు అహ‌ర్నిశలు క‌ష్ట‌ప‌డుతున్న ఆ పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారా..? పార్టీ అధికారంలోకి వ‌స్తే ఆ ఫ‌లాల‌ను అనుభ‌వించేందుకు వీలుగా త‌న భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ను ర‌చించుకుంటున్నారా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిస్తే ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశాలు ఉండ‌డంతో బండి సంజ‌య్ సుర‌క్షిత స్థానం కోసం ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం క‌రీంన‌గ‌ర్ ఎంపీగా ఉన్న బండి ఎమ్మెల్యేగా పోటీ చేసి మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. అయితే ఈసారి నియోజ‌క‌వ‌ర్గం మార‌నున్న‌ట్లు స‌మాచారం.

గ‌త రెండు ప‌ర్యాయాలు క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గంగుల క‌మ‌లాక‌ర్ చేతిలో ఓడిపోయారు బండి సంజ‌య్‌. అక్క‌డ గ‌ణ‌నీయంగా ముస్లిం ఓట్లు ఉండ‌డంతో త‌న ఓట‌మిపై ప్ర‌భావం చూపింద‌నే భావ‌నలో ఉన్నారాయ‌న‌.

అయితే, ఈసారి పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తుండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గం మారాలని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ అధ్య‌క్షుడిగా ఉండి ఓడిపోతే శ్రేణుల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌ని భావిస్తున్న‌బండి ఈసారి సేఫ్ జోన్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. గెలిస్తే సీఎం అయ్యే అవ‌కాశాలు ఉండ‌డం కూడా నియోజ‌క‌వ‌ర్గం మార‌డానికి మ‌రో కార‌ణంగా తెలుస్తోంది.

క‌రీంన‌గ‌ర్ కాకుండా ప‌క్క‌నున్న వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గంపై తొలుత దృష్టి సారించారు బండి. ఇక్క‌డి నుంచి పోటీ చేస్తే గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని భావించారట‌. అయితే.. ఇక్క‌డ నుంచి సీనియ‌ర్ నేత‌ చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావు కుటుంబం టికెట్ ఆశిస్తోంది. దీంతో బండి త‌న మ‌న‌సు మార్చుకుని మ‌రో నియోజ‌క‌వ‌ర్గం వేట‌లో ప‌డ్డార‌ట‌. క‌రీంన‌గ‌ర్‌, వేముల‌వాడ రెండింటిపై స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో బండి సంజ‌య్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ పై దృష్టి మ‌ళ్లించార‌ని జిల్లాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

హైద‌రాబాద్‌ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బండి సార‌థ్యంలో బీజేపీ అత్య‌ధిక స్థానాలు గెల్చుకున్న విష‌యం తెలిసిందే. అందుకే పార్టీ బ‌లంగా ఉన్న గ్రేట‌ర్ నుంచే పోటీకి ఆస‌క్తి చూపుతున్నార‌ట‌. ఎల్బీన‌గ‌ర్‌, గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదైనా ఒక స్థానం నుంచి బ‌రిలో నిల‌వాల‌ని యోచిస్తున్నార‌ట‌. గోషామ‌హ‌ల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ త‌ప్పుకోక‌పోతే ఎల్బీన‌గ‌ర్ నుంచి పోటీ చేస్తార‌ట బండి. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!
Tags:    

Similar News