బండి సంజయ్ ప్రజాప్రస్థానం అట్టర్ ఫ్లాప్ నా?

Update: 2022-08-04 12:39 GMT
ఉట్టికే ఎగురలేనమ్మా.. స్వర్గానికి నిచ్చెన వేసినట్టు తయారైందట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిస్థితి. కార్పొరేటర్ నుంచి ఎంపీ అయ్యి సడెన్ గా బీజేపీ ప్రోద్బలంతో ఏకంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన బండి సంజయ్ బడుగుల ప్రతినిధిగా ముందుగా అందరూ అభిమానించారు. కానీ ఆయన తన సహజ బీజేపీ, హిందుత్వ సిద్ధాంతాలతో అభిమానం మాయమైపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బండి సంజయ్ నల్గొండ జిల్లాలో నిర్వహించిన ‘ప్రజా ప్రస్థానం’ యాత్ర అట్టర్ ప్లాప్ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ జిల్లాలో కొందరు అడిగిన ప్రశ్నలకు ‘బండి’ సమాధానం చెప్పలేకపోయాడట.  దీంతో ‘బండి’ ప్రాబల్యం తగ్గుతోందని అనుకుంటున్నారు.

కేసీఆర్ ను టార్గెట్ చేసిన బండి పరుష వ్యాఖ్యలతో తన పరపతి పెంచుకోవాలనుకుంటున్నాడు. కానీ ప్రజలందరూ అలా ఉండరు.. కదా.. అరుస్తే కరుస్తారు.. అన్నట్లుగా ఎప్పుడూ ఒక వ్యక్తిపై ఆరోపణలు చేయడం ద్వారా రాష్ట్రం బాగుపడుతుందా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కేవలం కేసీఆర్ ను గద్దెదించడమే లక్ష్యంగా బండి సంజయ్ పనిచేస్తున్నాడా..? అని అడుతున్నారు. ధరలమోత.. నిరుద్యోగ సమస్యతో తెలంగాణ ప్రజానీకం అల్లాడిపోతుంది. ఈ సమస్యల పరిష్కారానికి దారి చూపండి సారు.. అంటూ బండి సారు మౌనమేల్చుతున్నాడట. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో బండికి ఎదురుదెబ్బలు మొదలయ్యాయని అంటున్నారు.

‘ప్రజా ప్రస్థానం’ పేరిట ఇప్పటికే బండి సంజయ్ రెండు విడుతలుగా పాదయాత్ర చేశారు. ఇప్పుడు మూడో పాదయాత్రను యాదాద్రి నుంచి మొదలు పెట్టారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు, కాంగ్రెస్, టీఆర్ఎస్ బలంగా ఉంది. దీంతో  ఆయా పార్టీలకు సంబంధించిన వారు బండి సంజయ్ ను కొన్ని ప్రశ్నలు అడుతున్నారట. అయితే కేసీఆర్ ను తిట్టడం తెలిసిన బండి సంజయ్ కి బీజేపీ వస్తే ఏం చేస్తుందో చెప్పలేకపోతున్నారు.

ఇప్పటి వరకు బీజేపీ నిర్వహించిన ఏ సమావాల్లోనే తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడం లేదు. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందోని చెబుతున్నాడే తప్ప ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి తన దగ్గర ఏ అస్త్రం ఉందో చెప్పలేకపోతున్నాడు.

మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే నల్గొండ జిల్లాలో ఇప్పటికే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పాదయాత్ర  నిర్వహించింది. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కోసం జనం బాగానే వచ్చారు. కానీ బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు అంతకంటే తక్కువగానే వస్తున్నారని అంటున్నారు. దీంతో షర్మిల పార్టీ కంటే బీజేపీ అంత అధ్వానంగా ఉందా..? అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ ‘మునుగోడు’ ఉప ఎన్నికలో  ఎలా గట్టెక్కుతారని అంటున్నారు.

మునుగోడులో టీఆర్ఎస్ తనకు పోటీగా కాంగ్రెస్ అంటోంది. బీజేపీని లెక్కలోకి తీసుకోవడం లేదు. అటు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా ఫలితం ఉండే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో బండి ‘ప్రజా ప్రస్థానం’కు ఎదురుదెబ్బలు తగలడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు కేవలం కేసీఆర్ ను విమర్శిస్తే చప్పట్లు కొట్టినవాళ్లు ఇప్పుడు ‘అరుపులు కాదు.. అభివృద్ది కావాలి’ అని అంటున్నారు.. ఇప్పటికైనా బండి సంజయ్ తన తీరును మార్చుకుంటారా..? లేక తన బాటలోనే నడుస్తారా..? అనేది చూడాలి.
Tags:    

Similar News