బండి సంజ‌య్ యాత్ర ఫెయిల్‌?

Update: 2022-04-15 08:09 GMT
కేసీఆర్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు.. ప్ర‌ధాని నరేంద్ర మోడీ పాల‌న‌లో దేశం సాధిస్తున్న ప్ర‌గ‌తిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకే ప్ర‌జా సంగ్రామ పాద‌యాత్ర అంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అంటున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌ను మ‌రింత టార్గెట్ చేసేలా ఏప్రిల్ 14న అంబేడ్క‌ర్ జ‌యంతి పుర‌స్క‌రించుకుని రెండో ద‌శ పాద‌యాత్ర‌కు జోగులాంబ ఆల‌యం నుంచి ఆయ‌న శ్రీకారం చుట్టారు. 31 రోజుల పాటు 386 కిలోమీట‌ర్ల మేర అయిదు జిల్లాలు, మూడు పార్ల‌మెంట్, 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ యాత్ర సాగుతుంది. అయితే తొలిరోజే సంజ‌య్ యాత్ర ఫెయిల్ అయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

రాని జ‌నం.. నేత‌లు 2020లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత బండి సంజ‌య్ పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. సీఎం కేసీఆర్పై అధికార టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు చేస్తూ సాగుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదిగే దిశ‌గా బీజేపీ సాగేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే గ‌తేడాది బండి సంజయ్ ప్ర‌జా సంగ్రామ యాత్ర మొద‌లెట్టారు. 36 రోజుల పాటు సాగిన తొలి ద‌శ పాద‌యాత్ర సంజ‌య్‌కు మ‌రింత ఉత్సాహాన్నిచ్చింది.

మ‌రోవైపు రాష్ట్ర రాజ‌కీయాల్లో ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. కేసీఆర్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తాజాగా రెండో ద‌శ పాదయాత్ర మొద‌లెట్టారు. కానీ పార్టీ ఊహించినంత జ‌నం కానీ పార్టీలోకి కీల‌క నేత‌లు కానీ బండి సంజ‌య్ స‌భ‌కు రాలేద‌ని టాక్‌. కాంగ్రెస్ టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స‌భ‌కు జ‌నం భారీ ఎత్తున వ‌స్తున్నారు. కానీ రేవంత్‌తో పోలిస్తే సంజ‌య్ స‌భ‌కు జ‌నం చాలా త‌క్కువ‌గా వ‌చ్చార‌ని తెలిసింది.

ఆ విభేదాలే కార‌ణం..రెండో దశ పాద‌యాత్ర ప్రారంభానికి ముందు సంజయ్ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. కానీ దానికి కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి హాజ‌రు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ‌త కొంత‌కాలంగా తెలంగాణ బీజేపీ సంజ‌య్‌, కిష‌న్‌రెడ్డి వ‌ర్గాలుగా విడిపోయింద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో కిష‌న్‌రెడ్డి ఈ స‌భ‌కు రాక‌పోవ‌డం ఆ ఊహాగానాల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది.

మ‌రోవైపు ఈట‌ల రాజేంద‌ర్ మిన‌హా మిగిలిన ఇద్ద‌రు బీజేపీ ఎమ్మెల్యేలు.. రాజాసింగ్‌, ర‌ఘునంద‌న్ రావు కూడా ఈ స‌భ‌లో క‌నిపించ‌లేదు. ఇప్ప‌టికే బండి సంజ‌య్ వైఖ‌రిపై ర‌ఘునంద‌న్‌ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఆహ్వానించ‌కుండా.. వేదిక‌పై మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కుండా అవ‌మానిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

ఇక‌పై త‌గ్గేదే లేదంటూ వార్నింగ్ కూడా ఇచ్చినంత ప‌ని చేశారు. ఇక గ‌తంలోనూ రాజాసింగ్ కూడా సంజ‌య్ తీరుపై అసంతృప్తి వెళ్ల‌గ‌క్కారు. ఈ నేప‌థ్యంలో బండి సంజ‌య్ రెండో ద‌శ పాద‌యాత్ర ఫెయిల్ అవుతుందంటూ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News