'రంభల రాంబాబు'.. ఊర మాస్ గా మారిన 'బండ్ల' పంచ్

Update: 2022-08-17 04:41 GMT
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. నిప్పును నిప్పుతోనే సమాధానం చెప్పాలి. దూకుడు రాజకీయాల్లో మునిగి తేలే వారికి.. ప్రశాంతచిత్తంతో ఉంటానని చెబితే చేతకానివాడిలా చూస్తారే తప్పించి.. మంచి మనసును అర్థం చేసుకునే అవకాశం ఉండదు. ఇష్టారాజ్యంగా మాట్లాడే వారికి విలువల గురించి.. మర్యాదల గురించి మాట్లాడితే అస్సలు సెట్ కాదు.

ఇప్పుడీ విషయం ఏపీ రాజకీయాల్ని చూస్తే అర్థమవుతుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా బరితెగింపురాజకీయాలు ఏపీలో కనిపిస్తున్నాయి. అధికార పక్షం అన్నది బాధ్యతతో.. మర్యాదతో వ్యవహరించాలన్న విషయాన్ని వదిలేసి.. తమకు తోచినట్లుగా మాట్లాడేయటం ఈ మధ్యన ఎక్కువైంది.

తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేస్తూ.. 'కాటన్ దుస్తుల ఛాలెంజ్ లు ఆపి 175 సీట్లకు పోటీ చేస్తున్నారా? లేదా? ఇండిపెండెన్స్ డే రోజైనా ప్రకటించండి' అంటూ ఫైర్ అయిన దానిపై జనసైనికులు ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తమ పార్టీ విధానాన్ని ప్రశ్నించటానికి అంబటి రాంబాబు ఎవరన్న ప్రశ్నతో పాటు.. అతడు అడిగితే మనం సమాధానం చెప్పాలా. ఒకవేళ అలానే అయితే.. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మండిపడుతున్నారు.

అంబటి రాంబాబు ట్వీట్ కు పవన్ ను విపరీతంగా విరుచుకుపడే బండ్ల గణేశ్ స్పందించారు. 'అలాగే రంభల రాంబాబుగారు మా సారు త్వరలో మీకు సమాధానం చెబుతారు. జై పవన్ కల్యాణ్ ' అంటూ తన మార్కు డైలాగ్ ను సంధించారు. అంబటికి ఏ మాత్రం తీసిపోని రీతిలో బండ్ల పంచ్ ఉందంటున్నారు.

అవసరం లేని విషయాల్ని తెర మీదకు తీసుకొచ్చి తనదైన వ్యాఖ్యలతో ఉక్కిరిబిక్కిరి చేయాలని తపించే అంబటికి.. బండ్ల గణేశ్ ఊరమాస్ వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారని చెప్పాలి. ఇప్పటికైనా పవన్ ను కదిలించుకోకూడదన్న బుద్ధి అంటికి వచ్చి ఉండాలన్న వాదనను వినిపిస్తున్నారు.
Tags:    

Similar News