పెద్ద‌ల స‌భ‌కు బండ్ల‌!... ఈ సారీ కామెడీనేనా?

Update: 2019-02-26 11:48 GMT
బండ్ల గ‌ణేశ్.. తెలుగు నేల‌లో ప‌రిచయం అక్క‌ర్లేని పేరే. టాలీవుడ్ లో క‌మెడియ‌న్‌ గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల‌... ఆ తర్వాత బ‌డా నిర్మాత‌గా చ‌క్రం తిప్పేశారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వీరాభిమానిగా త‌న‌ను తాను చెప్పుకున్న బండ్ల‌... రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస‌రికి జ‌న‌సేనానికి భారీ షాకిచ్చి హ‌స్తం పార్టీ నేత‌గా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. మొన్న‌టి తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని, ఎమ్మెల్యేగా గెలుపొంద‌డంతో పాటుగా ఏకంగా మంత్రినే అవుతానంటూ బాగానే కామెడీ చేశారు.

అయితే చివ‌ర‌కు టికెట్ కు కొర‌గాకుండా పోవ‌డంతో పాటు కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌క‌పోతే... గొంతు కోసుకుంటాన‌ని ప్ర‌క‌టించి అభాసుపాల‌య్యారు. సీన్ క‌ట్ చేస్తే... ఇప్పుడు తెలంగాణ శాస‌న మండ‌లి ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌రోమారు తెర మీద‌కు వ‌చ్చేశారు. దిగువ స‌భ‌కు ఎలాగూ అవ‌కాశం ద‌క్క‌లేద‌ని, దీంతో ఏకంగా పెద్ద‌ల స‌భ‌లోనే అడుగుపెడ‌తానంటూ ఇప్పుడు బండ్ల త‌న‌దైన శైలి య‌త్నాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ద‌క్కే సీటు ఒక్క‌టే కావ‌డంతో ఇప్పుడు కూడా బండ్ల న‌వ్వులపాలు కాక త‌ప్పదంటూ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. కాంగ్రెస్ కు ఎమ్మెల్యే కోటాలో ద‌క్కనున్న ఒకే ఒక్క సీటు కోసం ఆ పార్టీలోని హేమాహేమీలు పోటీ ప‌డుతున్నారు.

ఈ పోటీ ఎంత‌గా ఉందంటే... ఏకంగా 30 మంది నేత‌లు త‌మ‌దైన శైలి య‌త్నాలు చేస్తూ... ఆ సింగిల్ సీటును ఎగుర‌వేసుకుపోయేందుకు ప‌థ‌కాలు ర‌చిస్తున్నారు. అయితే తాను ఏ ఒక్క సీనియ‌ర్ నేత‌కు తీసిపోన‌న్న రీతిలో ఎంట్రీ ఇచ్చిన బండ్ల‌... కాంగ్రెస్ కు ద‌క్కే ఆ ఒక్క సీటును తానే ద‌క్కించుకుంటాన‌ని కాస్తంత గ‌ట్టిగానే చెబుతున్నారు. మ‌రి బండ్ల య‌త్నాలు ఫ‌లిస్తాయో, లేదంటే... అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరే ఈ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న అభాసుపాల‌వుతారో చూడాలి.
Tags:    

Similar News