రేవంత్ దెబ్బ‌కు.. బండి నెమ్మ‌దించిందా?

Update: 2021-08-10 13:30 GMT
గ‌త కొంత‌కాలంగా తెలంగాణలో రాజ‌కీయ ప‌రిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. రోజురోజుకూ వేడి పెరుగుతూనే ఉంది. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఈట‌ల రాజేంద‌ర్ జంప్ అయిన‌ప్ప‌టి నుంచి రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తీసుకుంటున్నాయి. అంత‌కుముందే భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు తీసుకున్న బండి సంజ‌య్ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌గా.. ఇప్పుడు కొత్త‌గా తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి అంత‌కు మించి దూసుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ వేగాన్ని అందుకోవ‌డంలో బండి సంజ‌య్ వెన‌క‌బ‌డ్డాడా? రేవంత్‌ జోరు ముందు బండి వేగం త‌గ్గిందా? అంటే రాజ‌కీయ వర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వ‌స్తున్నాయి.

గ‌తేడాది మార్చిలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ ప‌గ్గాలు చేప‌ట్టారు. అధిష్ఠానం త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ దూకుడు ప్ర‌ద‌ర్శించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తూ.. కార్య‌క‌ర్తల్లో ఉత్సాహం నింపారు. ఇదే వేగంతో సాగి దుబ్బాక ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు షాకిస్తూ ఎమ్మెల్యే స్థానాన్ని బీజేపీకి క‌ట్ట‌బెట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లోనూ అదే దూకుడుతో అనూహ్య ఫ‌లితాలు సాధించారు. అత‌ని సార‌థ్యంలో రాష్ట్రంలో బీజేపీ బ‌లంగా పుంజుకుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

మ‌రోవైపు కొన్నేళ్ల క్రిత‌మే తెలుగు దేశం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరి మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌ల్లో ఎప్పూడు ప‌దును ఉంటూనే ఉంటుంది. ఆయ‌న మాట‌లు బెరుకుండ‌దు. ఆయ‌న చేసే ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు ప్ర‌భుత్వాన్ని ఇరాక‌టంలో పెట్టే విధంగానే ఉంటాయి. ఇక ఇప్పుడు టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఆయ‌న మ‌రింత జోరు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పెరిగిన ఇంధ‌న ధ‌ర‌ల‌కు నిర‌స‌న‌గా ర్యాలీ నిర్వ‌హించ‌డం, నిరుద్యోగుల ప‌క్షాన నిల‌బ‌డ‌డం, వేలం వేసిన ప్ర‌భుత్వ భూముల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోపించ‌డం, ఫోన్ కాల్స్ ట్యాప్ విష‌యంలోనూ వేగంగా స్పందించ‌డం ఇలా ఆయ‌న దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడిక ఇంద్ర‌వెల్లి ద‌ళిత‌, గిరిజ‌న దండోరా స‌భ విజ‌య‌వంతం కావ‌డంతో ఆయ‌న మ‌రింత ఉత్సాహంతో క‌నిపిస్తున్నారు.

ఇప్పుడు రేవంత్ దూకుడు.. బండి సంజయ్ పై ప్ర‌భావం చూపే అవ‌కాశ‌ముంద‌ని రాజ‌కీయ వేత్త‌లు అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీని బ‌ల‌ప‌ర‌చ‌డంతో పాటు రాజ‌కీయాల్లో పెను మార్పులు సృష్టించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ నెల 9 నుంచి సంజ‌య్ రాష్ట్రవ్యాప్తంగా పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు గ‌తంలోనే ప్ర‌క‌టించారు. బుధ‌వార‌మే ఆయ‌న పాద‌యాత్ర ప్రారంభం కానున్న నేప‌థ్యంలో తొలి రోజు ల‌క్ష మందిని స‌మీక‌రించాల్సిన అవ‌స‌రం ఇప్పుడు ఆయ‌న‌కు ఉంది. లేక‌పోతే అది ఆయ‌న‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపే అవ‌కాశ‌ముంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రెండు విడ‌త‌లుగా రెండు నెల‌ల పాటు సాగే ఈ పాద‌యాత్రలో ఆయ‌న రాష్ట్రవ్యాప్తంగా 750 కిలోమీట‌ర్లు చుట్టేయాల‌ని ల‌క్ష్యంతో ఉన్న‌ట్లు స‌మాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇత‌ర కేంద్ర మంత్రుల‌ను ఈ పాద‌యాత్ర‌లో భాగం కావాల‌ని ఆయ‌న ఆహ్వానించారు. ఈ నేప‌థ్యంలో పాద‌యాత్ర‌లో భారీగా జ‌నం పాల్గొనేలా చూడాల్సిన ఒత్తిడి సంజ‌య్‌పై ఉంది. ఇంద్ర‌వెల్లి స‌భ‌ను విజ‌య‌వంతం చేసిన రేవంత్ లాగే ఈ పాద‌యాత్ర‌లోనూ ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల‌ను భాగం చేయాల్సిన బాధ్య‌త సంజ‌య్‌పై ఉంది. ఒక‌వేళ అలా జ‌ర‌గ‌క‌పోతే మాత్రం అది అత‌ని రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ప్ర‌భావం చూపే వీలుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.





Tags:    

Similar News