వంటలో ఉల్లిని వాడొద్దన్న దేశాధ్యక్షురాలు

Update: 2019-10-05 05:26 GMT
సరైన సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయం విషయంలో ఎలాంటి తడబాటు ఉండకూడదు. అలా వ్యవహరించే పాలకులు అతి కొద్ది మందే ఉంటారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఉల్లి బాంబు పేలనున్న వైనాన్ని గుర్తించిన కేంద్రం.. యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలతో ఉల్లి ధరలు ఇప్పుడు నేలకు వస్తున్నాయి.

మొన్నటివరకూ కేజీ ఉల్లి రూ.40 దాటి రూ.50 దిశగా పరుగులు పెడుతున్న వేళ.. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా కేజీ ఉల్లి పాతికకు పడిపోయింది. దేశంలో పండే ఉల్లి పంటను విదేశాల ఎగుమతిపై పూర్తిస్థాయిలో నిషేధాన్ని ప్రకటించటంతో దేశీయంగా ఉల్లి ధరలు తగ్గిపోయాయి.

అయితే.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పొరుగన ఉన్న బంగ్లాదేశ్ కు ఇబ్బందికరంగా మారింది. దేశంలో పండే ఉల్లి పంటను ఎక్కువ భాగంగా బంగ్లాదేశ్ కు వెళుతుంటుంది. ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించటంతో ఇప్పుడా దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి.

ఈ కారణంగా ఆ దేశం తెగ ఇబ్బందిపడుతోంది. ఇదే విషయాన్ని తాజాగా భారత్ లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు పెరిగిన ఉల్లి ధరల నేపథ్యంలో తాను తినే ఆహారం తయారీకి చేసే వంటల్లో ఉల్లిని అస్సలు వాడకూడదని తాను చెప్పినట్లు సరదాగా వ్యాఖ్యానించారు. ఉల్లి ఎగుమతుల నిర్ణయాన్ని భారత్ తీసుకునే ముందు.. తమకు కాస్త ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదన్న వ్యాఖ్యను చేశారు. నిజమే.. హసీనా యాంగిల్ లో అదీ నిజమే. 
Tags:    

Similar News