అంచ‌నానే నిజ‌మా?: వేలానికి హాయ్ ల్యాండ్‌!

Update: 2018-09-21 05:33 GMT
వినేందుకే విచిత్రంగా ఉంటుంది అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారం. ఎక్క‌డైనా ఒక సంస్థ ఆస్తులు క‌రిగిపోయి.. అప్పులు కొండ‌లా అయిన‌ప్పుడు చేతులు ఎత్తేయ‌టం చూస్తుంటాం. కానీ.. కొండ‌ల్లాంటి ఆస్తులు భారీగా ఉన్నా..వాటితో పోలిస్తే.. చెల్లించాల్సిన మొత్తం త‌క్కువే ఉన్న‌ప్ప‌టికీ.. స‌ద‌రు సంస్థ తీరు ర‌చ్చ ర‌చ్చ‌గా మార‌ట‌మే కాదు.. కోర్టు మెట్ల‌కు ఎక్క‌టం.. ఆపై చిత్ర‌.. విచిత్ర‌మైన ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం అగ్రిగోల్డ్ ఉదంతంలో క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆగ్రిగోల్డ్ డిపాజిటర్ల‌కు రీపేమెంట్ చేసేందుకు అవ‌స‌ర‌మైన న‌గ‌దు చేతిలో లేనందున‌.. ఆ గ్రూపున‌కు చెందిన ఆస్తులు.. భూముల్ని అమ్మేసి.. ఆ వ‌చ్చిన మొత్తాన్ని డిపాజిట‌ర్ల‌కు చెల్లించేలా ప్ర‌య‌త్నాలు ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవ‌ర్ ప్ర‌తిపాద‌న‌ను తెర మీద‌కు తెచ్చిన ఎస్సెల్ గ్రూపున‌కు చెందిన సుభాష్ చంద్ర ఫౌండేష‌న్ వెన‌క్కి త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. దీంతో.. హైకోర్టు అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం దిశ‌గా దృష్టి సారిస్తోంది. అగ్రిగోల్డ్ కు చెందిన హాయ్ ల్యాండ్‌ ను వేలం వేయ‌టం ద్వారా భారీగా డ‌బ్బు స‌మ‌కూరే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి త‌గ్గ‌ట్లే కోర్టు ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు షురూ చేస్తోంది.

ఆగ్రిగోల్డ్ యాజ‌మాన్యం హాయ్ ల్యాండ్ భూముల‌ను తాక‌ట్టు పెట్టి ఎస్ బీఐ నుంచి రుణం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో బ‌హిరంగ మార్కెట్లో హాయ్ ల్యాండ్ విలువ‌.. అప్పుల వివ‌రాల్ని తెలియ‌జేయాల‌ని ఎస్ బీఐ లాయ‌ర్ ను ఆదేశించింది. అగ్రిగోల్డ్ బాధితుల‌కు చెల్లించాల్సిన డ‌బ్బుకు మొద‌టి ఇన్ స్టాల్ మెంట్ కింద కొంత చెల్లించేంందుకు హాయ్ ల్యాండ్ భూముల విక్ర‌మం ఉప‌క‌రిస్తుంద‌ని చెబుతున్నారు. అంతేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ సంస్థ‌కు ఉన్న భూములు ఎన్ని?  బ‌హిరంగ మార్కెట్లో వాటికి ఉన్న విలువ ఎంత‌? అన్న ప‌ట్టిక‌ను కూడా త‌యారు చేయాల‌ని కోర్టు ఆదేశించింది.

ఇదిలా ఉంటే.. అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవ‌ర్ నుంచి వెన‌క్కి త‌గ్గిన సుభాష్ చంద్ర‌కు చెందిన ఫౌండేష‌న్.. కోర్టుకు తాను డిపాజిట్ చేసిన రూ.10కోట్ల మొత్తాన్ని వెన‌క్కి ఇవ్వాల‌ని కోరింది. ఇందుకు సంబంధించి ఒక పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

దీనికి బ‌దులిచ్చిన కోర్టు .. నిర్ణ‌యాన్ని వాయిదా వేసింది. డిపాజిట్ చేసిన మొత్తాన్ని వెన‌క్కి తిరిగి ఇచ్చే అవ‌కాశం లేద‌ని పేర్కొంది. అయితే.. కొంత మిన‌హాయింపును ఇచ్చి మిగిలింది ఇస్తామ‌న్న ప్ర‌క‌ట‌న చేసింది. ఆస్తుల టేకోవ‌ర్ కు తాము శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేసినా.. త‌మ అదుపులో లేని ప‌రిస్థితుల కార‌ణంతోనే తాము వెన‌క్కి వెళ్లిపోతున్న‌ట్లుగా సుభాష్ చంద్ర ఫౌండేష‌న్ కు చెందిన లాయ‌ర్ పేర్కొన‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. అగ్రిగోల్డ్ ఆస్తుల విష‌యంలో ఇక ప్ర‌తి శుక్ర‌వారం విచార‌ణ జ‌ర‌పాలంటూ ధ‌ర్మాస‌నం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఎంత‌కూ తేల‌నట్లుగా మారిన అగ్రిగోల్డ్ భూముల వేలం వ్య‌వ‌హారం.. రానున్న రోజుల్లో మ‌రెన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News