నాలుగేళ్ల‌లో బ్యాంకులు వ‌దులుకున్న‌ది తెలిస్తే షాకే!

Update: 2018-10-23 05:14 GMT
మీ డ‌బ్బుల్ని బ్యాంకులో దాచుకున్నారు. దాన్ని తీసుకోవ‌టానికి ఏటీఎంల‌కు వెళ్లారు. స‌ద‌రు బ్యాంకు చెప్పినన్నిసార్లు త‌ప్పించి.. అంత‌కు మించి వాడితే.. ప్ర‌తిసారీ వాడ‌కానికి ఇంత మొత్తం చొప్పున వ‌సూలు చేయ‌టం అంద‌రికి అల‌వాటే. అదేమంటే.. బ్యాంకు నిర్వాహ‌ణ ఛార్జీలు పెరిగిపోతున్నాయి.. మీరు కాకుంటే ఇంకెవ‌రు భ‌రిస్తారంటూ డిమాండింగ్ గా మాట్లాడ‌తారు.

కొన్ని బ్యాంకుల్లో నెల‌కు ఇన్నిసార్లు మాత్ర‌మే ఖాతాను నిర్వ‌హించాల‌ని.. అంత‌కు మించితే బాదేసే తీరుతో స‌హా.. సామాన్యుల‌కు బ్యాంకులు పెట్టే ష‌ర‌తులు అన్ని ఇన్ని కావు. ఇవ‌న్నీ ఎందుకు.. బ్యాంకులో సామాన్యులు త‌మ డ‌బ్బును దాచి ఉంచినందుకే. మ‌రి.. అలాంటి బ్యాంకులు అప్పు ఇవ్వాల్సి వ‌స్తే.. సామాన్యుల‌కు చుక్క‌లుచూపించ‌టం తెలిసిందే.

ఇచ్చే ల‌క్ష రూపాయిల రుణానికి.. అన్ని ర‌కాలుగా జాగ్ర‌త్త‌లు తీసుకొని.. ఏ మాత్రం తేడా వ‌చ్చినా రిక‌వ‌రీకి ఢోకా లేని రీతిలో రుణాలు ఇచ్చే ధోర‌ణి క‌నిపిస్తుంది. మ‌రీ.. ఇంత దారుణ‌మా? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తే.. మ‌రికొంద‌రు ఆ మాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకోకుంటే ఎలా? అని ప్ర‌శ్నించేటోళ్లు క‌నిపిస్తారు. సామాన్యుల విష‌యంలో త‌మ ప్ర‌తాపాన్ని ప్ర‌ద‌ర్శించే బ్యాంకులు.. పెద్ద పెద్ద కంపెనీల‌కు.. బ‌డా బాబుల విష‌యంలో వ్య‌వ‌హ‌రించే తీరు షాకింగ్ గా ఉంటుంది.

పైసా వ‌దులుకోవ‌టానికి స‌సేమిరా అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించే బ్యాంకులు.. గ‌డిచిన నాలుగేళ్లలో మొండి బాకీల పేరుతో వ‌దులుకున్న మొత్తం తెలిస్తే గుండె గుభేల్ మ‌న‌టంతో పాటు.. ఇంత భారీ మొత్తాన్ని అంత సింఫుల్ తా ఎలా చెబుతారండి? అన్న క్వ‌శ్చ‌న్ రాక మాన‌దు. సామాన్యుల విష‌యంలో ఛార్జీల మోత మోగించే బ్యాంకులు.. మ‌రింత పెద్ద ఎత్తున బాకీల్ని ఎగ్గొట్టే కంపెనీల విష‌యంలోనూ.. పెద్ద మ‌నుషుల విష‌యంలో ఏం చేస్తున్నారు? అని ప్ర‌శ్నిస్తే.. స‌మాధానం రాని ప‌రిస్థితి.

2014 నుంచి 2018 మ‌ధ్య కాలంలో బ్యాంకులు ఇచ్చి తిరిగి వ‌సూలు చేసుకోలేక‌పోయిన మొత్తం లెక్క తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్పుడు చెప్ప‌బోయే లెక్కంతా ప్ర‌భుత్వ రంగ బ్యాంకులే సుమా. ప్రైవేటు బ్యాంకుల్ని మిన‌హాయించి ప్ర‌భుత్వ బ్యాంకులు తాము ఇచ్చిన రుణాల్ని తిరిగి వ‌సూలు చేసుకోలేమ‌ని చేతులెత్తేసిన మొత్తం నాలుగేళ్ల‌లో అక్ష‌రాల రూ.3.16 ల‌క్ష‌ల కోట్లుగా చెబుతున్నారు.

ఏడాదికేడాది ఈ మొత్తం పెరిగి పెద్ద‌ది కావ‌టం గ‌మ‌నార్హం. సామాన్యుడి విష‌యంలో చెల‌రేగిపోయే బ్యాంకులు.. పెద్ద పెద్ద కంపెనీల‌కు.. బ‌డా వ్య‌క్తుల‌కు ఇచ్చే అప్పు విష‌యంలో తేడా వ‌స్తే.. కిందా మీదా ప‌డిన‌ట్లు క‌నిపించినా.. అంతిమంగా మొండి బాకీల ట్యాగ్ క‌ట్టేసి.. ఓ ప‌క్క‌న ప‌డేయ‌టం క‌నిపిస్తోంది.

రూ.3.16 ల‌క్ష‌ల కోట్ల మొండి బ‌కాయిలు అంటే.. అది సామాన్యుడు దాచుకున్న మొత్తాల‌తో పాటు.. ప‌రిమితికి మించి ఏటీఎంలు వాడితే బాదేసే ఛార్జీల్లాంటి వాటివెన్నింటితోనో వ‌చ్చే వేలాది కోట్ల‌ను ఇలా గంప‌గుత్త‌గా.. కొన్ని కంపెనీల‌కు అప్పుల కింద ఇచ్చి.. రాని బాకీల ఖాతాల్లోకి రాసుడేంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

కాసిన్ని డ‌బ్బులు తీసుకొని తిరిగి ఇవ్వ‌క‌పోతేనే ర‌చ్చ చేసే వారెంద‌రో క‌నిపిస్తారు. మ‌రి.. వేలాది కోట్ల రూపాయిలు ద‌ర్జాగా తీసుకొని.. తిరిగి ఇవ్వ‌ని వారి గుట్టు ర‌ట్టు చేయ‌టంతో పాటు..వారిని బ‌జారుకు ఈడిస్తే.. అలాంటి ఆలోచ‌న‌లు ఉన్న వారంతా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకునే అవ‌కాశం ఉంది. కానీ.. అదేమీ చేయ‌కుండా.. సింఫుల్ గా మొండి బాకీల ఖాతాల్ని జ‌మాఖ‌ర్చుల చిట్టాలో చూపిస్తే స‌రిపోతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌.

మొండి బాకీల పేరుతో ర‌ద్దు చేస్తున్న భాగోతాల్ని కొన్ని ముఖ్యాంశాల్ని చూస్తే..

+ గ‌డిచిన నాలుగైదేళ్లుగా అంటే మోడీ స‌ర్కారు కొలువు తీరిన త‌ర్వాత ర‌ద్దు చేస్తున్న మొండి బాకీల మొత్తం పెరగ‌టం

+  2016-17లో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.81,683 కోట్ల మొండి బాకీలను రద్దు చేశాయి.

+ అందులో ఎస్‌ బీఐ వాటా ఒక్కటే రూ.40,196 కోట్లు.

+ ఆ త‌ర్వాతి స్థానాల్లో కెన‌రా బ్యాంకు.. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలు ఉన్నాయి

+ భారీ ఎత్తున మొండి బాకీల్ని ర‌ద్దు చేసిన స‌ద‌రు బ్యాంకులు ఆ ఏడాది ఆర్జించిన నిక‌ర లాభం కేవ‌లం రూ.473కోట్లే.

+ మొండి బాకీల కార‌ణంగా భారీగా న‌ష్ట‌పోతున్న‌ప్ప‌టికీ బ్యాంకులు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం లేద‌న‌టానికి నిద‌ర్శ‌నం 2017-18 నాటి బ్యాంకుల న‌ష్టాలే నిద‌ర్శ‌నం.

+  2017-18లో బ్యాంకులు రూ.85,370 కోట్ల మేరకు నష్టాలు నమోదు  చేశాయి.

+  అగ్రశ్రేణి బ్యాంకు ఎస్‌ బీఐ గత మూడు త్రైమాసికాలుగా నష్టాలనే ప్రకటిస్తోంది.

+ ఈ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.2,146 కోట్లు - నాలుగో త్రైమాసికంలో రూ.7,718 కోట్లు - ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.4,875 కోట్లు నష్టపోవ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News