ఎన్డీటీవీకి బర్కా గుడ్ బై

Update: 2017-01-15 14:42 GMT
దేశంలో సవాలచ్చ మంది జర్నలిస్టులు ఉన్నా.. కొందరికి మాత్రం వచ్చే పేరు ప్రఖ్యాతులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. తోపుల్లాంటి జర్నలిస్టులు చాలానే మంది ఉన్నా.. జనాలకు సుపరిచితులుగా ఉంటూ.. సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేసే వారు చాలా చాలా తక్కువ మంది. రాజకీయ ప్రముఖులకు సుపరిచితులైన చాలామంది ప్రజలకు మాత్రం అపరిచితుల మాదిరే ఉంటారు. అందరికి సుపరిచితులుగా ఉండే జర్నలిస్టులలో కొందరికుండే గ్లామర్ అంతా ఇంతా కాదు.

జర్నలిజం మీద ఏ మాత్రం ఆసక్తి ఉన్నా.. న్యూస్ ఛానల్స్ చూసే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచితులు ఆర్నబ్ గోస్వామి. మాటల్ని తూటాల్లా సంధించటమే కాదు.. కొమ్ములు తిరిగిన రాజకీయ నేతలకు తన మాటలతో.. ప్రశ్నలతో మంచినీళ్లను తాగించేస్తుంటారు. టైమ్స్ నౌ ఛానల్ ద్వారా పరిచయమైన ఆయన.. ఈ మధ్యనే ఆ ఛానల్ కు గుడ్ బై చెప్పేసి బయటకు వెళ్లిపోయి.. సొంతంగా ఛానల్ ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు.

తాజాగా.. ఆ జాబితాలోనే చేరారు మరో ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్. ఎన్డీటీవీ కన్సల్టింగ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఆమె దేశ ప్రజలందరికి సుపరిచితురాలు. కార్గిల్ వార్ రిపోర్టింగ్ తో పాటు మరెన్నో సంచలన కథనాలకు సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఆమె.. ఎన్డీటీవీ నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా ఆమె సొంత ఛానల్ ఒకటి ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లుగా చెబుతారు. జర్నలిజానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాన్ని ఆమె పొందారు.

21 ఏళ్ల పాటు ఎన్డీటీవీలో వివిధ హోదాల్లో పని చేసిన ఆమెపై ప్రశంసలే కాదు.. విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రాడియా టేపుల్లో ఆమె ఇరుక్కున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉంటే.. సెలబ్రిటీ స్టేటస్ ఉన్న జర్నలిస్టులు ఒకరి తర్వాత ఒకరుగా సొంత ఛానళ్లు పెట్టుకోవటం ఏమిటంటారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News