అబ్బే.. మేం టీఆర్ఎస్‌ లో చేర‌డం లేదు

Update: 2018-12-19 07:05 GMT
అధికార టీఆర్ఎస్ పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పార్ట్ 2కు తెర‌తీయ‌డం, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీగా పార్టీ ఫిరాయించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తుండ‌టం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఎవ‌రు పార్టీ లో చేర‌నున్నారు? ఎవ‌రు కొన‌సాగ‌నున్నార‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా సాగుతోంది. ప్ర‌ధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచిన ఖ‌మ్మం జిల్లా పై అంద‌రి ఫోక‌స్ ప‌డింది. అయితే, తాజాగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క దీనికి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ టీఆర్ఎస్‌లోకి వెళ్లడం లేదనీ, సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దనీ  అన్నారు. కేవ‌లం త‌ను త‌న మాట‌గా చెప్ప‌కుండా... గెలిచిన ఎమ్మెల్యేల‌ తో ఆయ‌న విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

ఖ‌మ్మం జిల్లాలోని కాంగ్రెస్‌ కు చెందిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి- కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు- ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ- పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుల తో కలిసి భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌ పార్టీ యథేచ్ఛగా డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగం చేసి తిరిగి అధికారంలోకి వచ్చిందన్నారు. అయినప్పటికీ ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రం జిల్లా ఆత్మ గౌరవాన్ని, పౌరుషాన్ని నిలబెట్టేలా ప్రజాకూటమి వైపు నిలిచారన్నారు.

పదిస్థానాల్లో కేవలం ఒక్కటి మాత్రమే టీఆర్ఎస్‌ గెలిచిందన్నారు. మిగతా స్థానాల్లో ప్రజాకూటమికి పట్టంకడుతూ ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని మరోసారి నిరూపించారన్నారు. జిల్లా ప్రజలకు రుణపడి ఉంటామనీ, వారి నమ్మకాన్ని ఎట్టిపరిస్థితిలోనూ వమ్ము చేయబోమనీ అన్నారు. ఖమ్మం పార్లమెంట్‌ స్థానాన్ని కచ్చితంగా గెలుస్తామనీ ప్ర‌క‌టించారు. తాము పార్టీ ఫిరాయించ‌డం లేద‌ని గెలిచిన ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు.


Tags:    

Similar News