ఈ వాయిదాలేంది? ఈ పారిపోవటమేంది?

Update: 2015-10-02 15:24 GMT
‘‘ఏ అంశం మీదనైనా సరే.. ఎన్ని రోజులైనా చర్చిద్దాం. ప్రతి విషయం మీదా మాట్లాడుకుందాం. మేం వెనక్కి తగ్గం. ప్రతి విషయానికి సమాధానం చెబుతాం’’ ఇలా ఎన్నో మాటలు చెప్పిన తెలంగాణ అధికారపక్షం అందుకు భిన్నమైన వైఖరి ప్రదర్శించటంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.  ఎంతసేపైనా చర్చకు రెఢీ అని చెప్పేసిన టీఆర్ ఎస్ సర్కారు ఇలా మధ్యలో వాయిదా వేసి పారిపోవటం ఏమిటంటూ వారి ప్రశ్నిస్తున్నారు.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క గళం విప్పారు. తెలంగాణ సర్కారు వైఖరిని తీవ్రంగా విమర్శించిన ఆయన.. అసెంబ్లీ వాయిదా వేసిన తీరును తప్పు పట్టారు. ఏ సమస్య మీదనైనా సరే ఎన్ని రోజులైనా మాట్లాడతామని చెప్పిన ముఖ్యమంత్రి.. రైతుల రుణమాఫీపై మాత్రం అందుకు భిన్నంగా వాయిదా వేసి పారిపోయారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ అధికారపక్షంపై తెలంగాణ విపక్షాలన్నీ కలిసి పోరాటం చేస్తాయని.. రుణమాఫీని ఒకేదఫా అమలు చేయటంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానమ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సభను అర్థాంతరంగా వాయిదా వేసిన అంశం తెలంగాణ అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారిందన్న భావన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాల్ని కంట్రోల్ చేయబోయిన అధికారపక్షం తనకు తానే ఇరుక్కుపోయినట్లుందే.
Tags:    

Similar News