భ‌ట్టి ఫైర్‌: త‌లంబ్రాల్ని మ‌న‌మ‌డి చేత ఇప్పిస్తారా?

Update: 2017-04-07 14:26 GMT
తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో బ‌ల‌మైన వాయిస్ ఉన్న నేత‌లు కొంద‌రు ఉన్నారు. వారు కానీ నోరు విప్పితే.. ప్ర‌త్య‌ర్థులు స‌మాధానాలు చెప్ప‌టం అంత తేలికైన విష‌యం కాదు. మాట‌ల మ‌రాఠీ అయిన కేసీఆర్‌.. ఆయ‌న‌కు త‌గ్గ‌ట్లే మాట‌ల‌తో మురిపించే కేటీఆర్ కానీ హ‌రీశ్ కానీ త‌మ వాద‌న‌ల‌కు అస‌రాగా వ‌చ్చే అంశాల కోసం వెతుక్కోవాల్సిందే. త‌మ ప‌దునైన వాద‌న‌తో ప్ర‌త్య‌ర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే స‌త్తా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో భ‌ట్టి విక్ర‌మార్క ఒక‌రు. కాకుంటే.. అప్పుడ‌ప్ప‌డు మాత్రమే శివాలెత్తే ఆయ‌నకు ఉండే ప్రాబ్లం ఏమిటంటే.. ఆయ‌న మాట‌లు మీడియాలో పెద్ద‌గా ఫోక‌స్ కావు.

త‌న ప‌దునైన వాద‌న‌తో ప‌లుమార్లు కేసీఆర్‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసిన స‌త్తా భ‌ట్టి విక్ర‌మార్క‌ది. తాజాగా ఆయ‌న ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని అంశాన్ని ట‌చ్ చేసి.. త‌న విల‌క్ష‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. స్వ‌ల్ప అనారోగ్యం కార‌ణంగా ప్ర‌తిఏటా శ్రీరామ‌న‌వ‌మి వేళ భ‌ద్రాద్రిలో శ్రీరామ‌చంద్ర‌ప్ర‌భువుకు ముత్యాల త‌లంబ్రాల్ని ప్ర‌భుత్వ పెద్ద అంద‌జేసే ఆచారానికికేసీఆర్ హాజ‌రు కాక‌పోవ‌టం తెలిసిందే.

అనారోగ్యంతో ఉన్న‌ప్పుడు హాజ‌రు కాక‌పోవ‌టం ఎవ‌రూ కాద‌న‌లేనిదే అయినా.. స‌మ‌స్యంతా ఆయ‌న మ‌న‌మ‌డి చేత త‌లంబ్రాలు ఇప్పించ‌టాన్ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫు కాద‌ని.. కేసీఆర్ కుటుంబం త‌ర‌ఫున మ‌న‌మ‌డి చేత ప‌ట్టువ‌స్త్రాల్ని స‌మ‌ర్పించిన‌ట్లు చెబుతున్నా.. అందులో నిజం లేద‌న్న మాట‌ను ప‌లువురు చెబుతున్నారు.తాజాగా ఇదే విష‌యాన్ని తెర మీద‌కు తీసుకొచ్చారు భ‌ట్టి విక్ర‌మార్క‌. శ్రీరామ న‌వ‌మి సంద‌ర్బంగా భ‌ద్రాద్రిలో నిర్వ‌హించిన రాములోరి క‌ల్యాణానికి త‌లంబ్రాల‌ను కేసీఆర్ మ‌న‌మ‌డు అంద‌జేయ‌టం దారుణ‌మ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తానేం చేసినా చెల్లుబాటు అవుతుంద‌న్న‌ట్లుగా కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలి ఉంద‌న్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని హామీ ఇచ్చి మ‌రీ అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌.. ఇప్ప‌టివ‌ర‌కూ గ్రామానికో ఉద్యోగం కూడా ఇవ్వ‌లేద‌ని ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఓ పిల్ల‌కాకి అని.. విమ‌ర్శ‌లు చేసేట‌ప్పుడు ఒళ్లు ద‌గ్గ‌ర ఉంచుకొని మాట్లాడాల‌ని హెచ్చ‌రించారు. ప‌వ‌ర్‌లోకి వ‌చ్చిన మూడేళ్ల‌లో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాల‌ని ఆయ‌న నిల‌దీశారు. మిగిలిన విష‌యాల సంగ‌తి ఎలా ఉన్నా.. రాములోరి క‌ల్యాణం ఎపిసోడ్ మాత్రం కొంద‌రి మ‌న‌సుల్లో రిజిష్ట‌ర్ అయ్యింద‌న్న మాట వినిపిస్తోంది.ఈ త‌ర‌హా వ్య‌వ‌హార‌శైలి ప్ర‌జ‌ల మ‌న్న‌న పొంద‌ద‌ని.. అహంకారానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇందులో నిజం ఎంత‌న్న‌ది కాల‌మే తేల్చాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News