ఆ రంగు చూసి భట్టికి మంట పుట్టింది

Update: 2016-01-22 10:31 GMT
అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా.. తాము చేసే ప్రతి కార్యక్రమానికి తమ పార్టీ రంగును పులిమేయటం మామూలే. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ రంగు కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. నిజానికి ఇదేం కొత్త విషయం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల కాంగ్రెస్ పాలనలో చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో మూడు జెండాల రంగు ఎంతగా దర్శనమిచ్చేదో అందరికి తెలిసిందే. ఇది.. అదన్న తేడా లేకుండా ప్రతి కార్యక్రమంలోనూ మూడు జెండాల రంగు కనిపించేది. దీనిపై విమర్శలు వెల్లువెత్తినా అస్సలు పట్టించుకునే వారు కాదు.

తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేయటం తప్పుగా ఫీల్ కాని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు మాత్రం టీఆర్ ఎస్ సర్కారు చేస్తున్న పనులు చాలా చిత్రంగా అనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ జెండా రంగు వాడటం ఏమిటి? అంటూ కొత్తగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోని ఒక ప్రభుత్వ కార్యక్రమంలో గులాబీ రంగుతో దిమ్మ కట్టటం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్కకు మండిపోయింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రం నుంచి గుంటుపల్లి గోపవరం వరకు రూ.12కోట్లతో బీటీ రోడ్డును విస్తరించే పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు.. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్కలు పాల్గొన్నారు. అయితే.. అక్కడ ఏర్పాటు చేసిన దిమ్మ గులాబీ రంగుతో ఉండటం విక్రమార్కకు కోపం నశాళానికి అంటింది. ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ రంగు దిమ్మ ఏంటంటూ అగ్రహం వ్యక్తం చేసి.. కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఇంత కోపం వచ్చిన భట్టికి తాము అధికారంలో ఉన్న పదేళ్లు ఏం చేశామన్న విషయాన్ని మర్చిపోవటం ఏమిటో..?
Tags:    

Similar News