కాపులకు పోటీగా బీసీ గర్జన?

Update: 2016-11-17 07:20 GMT
కాపులకు అది చేస్తాం.. ఇది చేస్తామంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఏమీ చేయకుండా కాపులను కేవలం మోసం మాత్రం  చేయడానికి సిద్ధమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాపులకు ఏం చేసినా బీసీలు అడ్డు పడుతున్నారన్న సీను సృష్టించేందుకు బీసీ గర్జనలకు రంగం సిద్ధం చేస్తున్నారన్న ఆరోపణలు కాపుల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాపులకు రిజర్వేషన్లు అన్న తన హామీ అమలు చేయాల్సిన పరిస్థితి రాకుండా బీసీ ఉద్యమాలకు బీజం వేస్తున్నారని అంటున్నారు.

కాపుల ఒత్తిడికి సర్కారు తలొగ్గకుండా తాము కూడా అందుకు ప్రతిగా ఒత్తిడి రాజకీయానికి తెరలేపే ప్రణాళికలకు బీసీలు పదునుపెడుతున్నారు. ‘కాపులకు ఏమైనా ఇవ్వండి. రాజకీయ రిజర్వేషన్లు తప్ప’ అనే నినాదంతో ఫిబ్రవరిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాపు మంత్రులు - ఎమ్మెల్యేలు తెదేపా సర్కారుపై ఒత్తిడి పెంచి తమకు కావలసిన డిమాండ్లు సాధించుకుంటున్న నేపథ్యంలో, తాము మౌనంగా ఉంటే తమ హక్కులు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్న బీసీలు - తాము కూడా అదే స్థాయిలో సర్కారుపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. కాపులకు కార్పొరేషన్ పెట్టి ఎన్నివేల కోట్లు ఇచ్చినా, ఆ వర్గ విద్యార్థులకు ఎన్ని లక్షల రూపాయల రుణాలిచ్చినా తమకు అభ్యంతరం లేదని, అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బీసీల్లో చేరే కాపులకు ఆ రిజర్వేషన్ అర్హత లేకుండా నిబంధన రూపొందించిన తర్వాత, వారిని బీసీల్లో చేర్పిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్న వాదనకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. ఈ విషయంలో ముందు బీసీ మంత్రులు - ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి - వారిపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు.

సామాజికవర్గపరంగా కాపులను వ్యతిరేకించే శెట్టిబలిజలు ఈ విషయంలో సీరియస్‌ గా ఉన్నట్లు చెబుతున్నారు.  ముద్రగడ గతంలో చేసిన కాపు ఉద్యమాల వల్ల ఎక్కువగా నష్టపోయింది తామేనని, బీసీ రిజర్వేషన్ డిమాండుతో మళ్లీ ఈసారి కూడా తామే నష్టపోతున్నామని శెట్టిబలిజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కోస్తాలోనే భారీ బహిరంగసభ పెట్టి బీసీల సత్తా చూపిస్తామని చెబుతున్నారు. బీసీ వర్గాల సమాచారం ప్రకారం రాజమండ్రి వేదికగా వచ్చే ఫిబ్రవరిలో బీసీ గర్జన నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. రాజమండ్రిని వేదికగా ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం కూడా ఉందంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో శెట్టిబలిజల బలమేమిటో సర్కారుకు చాటాలంటే రాజమండ్రినే సరైన వేదిక అని వారు స్పష్టం చేస్తున్నారు. కాగా శెట్టిబలిజలను చంద్రబాబే ముందుకు తెస్తున్నారన్న అనుమానాలు, విమర్శలు కాపుల నుంచి వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News