చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న బీసీసీఐ..

Update: 2023-01-02 12:40 GMT
చేతులు కాలాక బీసీసీఐ ఆకులు పట్టుకుంటోంది. 2011లో ధోని హయాంలో వన్డే ప్రపంచకప్ గెలిచాక మరోసారి మన టీమిండియా కప్ కొట్టలేదు. నాడు సచిన్ రిటైర్ మెంట్ కోసం అందరూ ప్రాణం పెట్టి మరీ ఆడి ఆయనకు కప్ ను కానుకగా ఇచ్చారు. 2019లోనూ ధోనికి ఇలా కప్ నందించాలని.. అందుకోసం కీలక ప్లేయర్లకు ఐపీఎల్ నుంచి విరామం ఇవ్వాలని నాటి కెప్టెన్ కోహ్లీ కోరాడు. కానీ నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కానీ.. బీసీసీఐ పెద్దలు కానీ వినలేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు పెట్టి కొన్న ప్లేయర్లను ఆడకుండా దూరం పెట్టడం సాధ్యం కాదన్నారు.

ఇప్పటికీ కూడా బీసీసీఐ కళ్లు తెరవడం లేదు. ఐపీఎల్ కు దూరంగా టీమిండియా ఆటగాళ్లను ఉంచడం లేదు. అందుకే ఈ విలాపం. ప్రతీసారి కప్ కొట్టాలని దేశ క్రికెట్ అభిమానులు  మొక్కులు మొక్కుకోవడం.. మనవాళ్లు మొదట్లో ఊదరగొట్టి కీలకమైన నాకౌట్ మ్యాచుల్లో చేతులేత్తేసి ఉత్త చేతులతో తిరిగి రావడం ఖాయమైపోయింది. ఇప్పటికీ అదే కథ..

గత ఆసియా కప్ లో పాకిస్తాన్ చేతిలో ఓడి టీమిండియా నిండా మునిగింది. అప్పుడే తీవ్ర విమర్శలు వచ్చాయి. కోహ్లీని దించి రోహిత్ కు పగ్గాలు అప్పగ్గిస్తే కప్ నందిస్తాడని అనుకుంటే కెప్టెన్సీ తేలిపోవడంతో అందరూ ఊసురుమన్నారు. ఇక ప్రపంచకప్ టీ20లకు వెళ్లిన టీమిండియా కప్ గెలుస్తుందని ఏకంగా స్టార్ స్పోర్ట్ కోహ్లీతో ఒక పెద్ద యాడ్ చేసింది. 2011లో ధోని కప్ కొట్టి ఊరేగిన బస్సును శుభ్రం చేయిస్తూ ఈసారి దీని మీద మళ్లీ ర్యాలీతీస్తామని ప్రగల్బాలు పలికారు. కానీ ఏమైంది.. ఈసారి కూడా సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడింది.

ఇప్పుడు పోస్టుమార్టం నిర్వహించిన బీసీసీఐ 20 మంది కీలక ఆటగాళ్లను ఎంపిక చేసి వారిని ఐపీఎల్ లో ఆడకుండా చూడాలని డిసైడ్ అయ్యింది. వారందరినీ ఈసారి సీజన్ కు పక్కనపెట్టాలని.. భారత్ కు కప్ రావాలంటే వారు గాయాల పాలు కాకుండా.. మంచిగా కండీషన్ గా ఉండాలని.. అందుకోసమే ఈసారి మ్యాచ్ ల్లో వీరు లేకుండా విశ్రాంతినివ్వాలని ఆలోచిస్తున్నారు.

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇదే చేసింది. వారి క్రికెటర్లను లీగ్ లు ఆడకుండా దేశం కోసం ఆడాలని రెస్ట్ ఇచ్చింది. కేవలం ప్రపంచకప్ కోసమే చాలా మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ సంవత్సరం లీగ్ లు ఆడలేదు. వారి ఉత్సాహం జోష్ అలానే ఉండి కప్ కొట్టారు. ఇప్పుడు బీసీసీఐ కూడా అదే పనిచేయడానికి రెడీ అయ్యింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న బీసీసీఐ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News