వైఎస్సార్సీపీలో బీకామ్ లో ఫిజిక్స్ లో పెరిగారా?

Update: 2019-07-27 17:30 GMT
నేతలు తాము ఏం మాట్లాడుతున్నామో బాగా ఎరుకలో ఉండి మాట్లాడాలి. లేకపోతే అంతే సంగతులు. అసలే ఇది సోషల్ మీడియా యుగం. నేతలు దొరికితే  నెటిజన్లు అస్సలు వదలరు. అలాంటి వ్యవహారాలను చాలా మంది గమనించే ఉంటారు. గత పర్యాయం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున చాలా మంది తమ మాటలతోనే బుక్ అయ్యారు.

బీకామ్ లో ఫిజిక్స్ అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఇక లోకేష్ సంగతి సరే సరి. లోకేష్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి ఆయన మాట తీరే కారణం అని వేరే చెప్పనక్కర్లేదు. ఈ ఏమాత్రం మెలకువతో ఉన్నట్టుగా మాట్లాడడు ఆయన. దీంతో ఆయన ఎమ్మెల్యేగా కూడా వద్దన్నట్టుగా మంగళగిరి జనాలు తీర్పును ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీకి భావి ఆశాకెరటం అయిన లోకేషే  ఆ తీరున కొనసాగుతూ ఉండటం ఆ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారింది.

తెలుగుదేశం సంగతలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ బీకామ్ లో ఫిజిక్స్ నేతలు తెర మీదకు వస్తున్నారు. కొందరు నేతలు మాటల విషయంలో తడబడుతూ ఉన్నారు. అసెంబ్లీలోనే అలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉండటం గమనార్హం.

అమెరికాను కని పెట్టింది కొలంబస్ అంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అంటే - పక్కనున్న ఎమ్మెల్యేలు కూడా అదే పలికారు. ఇక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్వామి వివేకానందను వివేకానందరెడ్డి అని చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా ఇలాంటివి చోటు చేసుకున్నాయి. టీవీలో వీటిని చూసే వాళ్లు నవ్వుకోవడం ఖాయం. ఇలాంటి అంశాలే సోషల్ మీడియాలో గట్టిగా చర్చనీయాంశంగా నిలుస్తాయి.

ఇలాంటి విషయాల్లో ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంది. ఏ మాత్రం ప్రిపరేషన్ లేకుండా అసెంబ్లీలో మాట్లాడేందుకు వెళ్లడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఒక్కసారి ఇలా వీడియోకు  ఎక్కితే ఆ తర్వాత అవి శాశ్వాతంగా నిలిచిపోయే అవకాశం ఉంది. అందుకే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిద్దరమత్తును వదిలించుకోవాలని పరిశీలకులు చురకలంటిస్తున్నారు.
Tags:    

Similar News