బీచ్ అంటే గోవానే కాదు...ఇదుగో ఇవన్నీ ఉన్నాయి

Update: 2019-10-23 01:30 GMT
స్వచ్ఛమైన సముద్రం నిశ్చలంగా ఉండి.. దాని చుట్టూ పచ్చటి చెట్లు.. మధ్యలో మనం ఉంటే ఆ ఫీలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా! మీక్కూడా ఆ ఫీలింగ్ అనుభవించాలని ఉందా?  గోవా కాకుండా..మరేదైనా ప్రాంతంలోఅలాంటి చ‌క్క‌టి బీచ్‌ లు ఎక్క‌డున్నాయా అని వెతుకుతున్నారా? ఇదిగోండి ఆ వివ‌రాలు...

యారాడా బీచ్– ఆంధ్రప్రదేశ్

విశాఖకు 15 కిమీల దూరంలో ఈ బీచ్ ఉంది. ఈ బీచ్ మిగతా సముద్ర తీరాలు కంటే భిన్నంగా ఉంటుంది. యారాడ వద్ద ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో మొత్తం 5 ఎకరాల స్థలంలో పర్యాటకుల కోసం ప్రాథమిక - మౌలిక సదుపాయాల కల్పన - అభివృద్ధి పనులను చేశారు. బీచ్‌ లో నీడనిచ్చే గుడిసెలు, బెంచీలు, రెస్టారెంట్‌ - యాంఫీ థియేటర్‌ - చిల్డ్రన్‌ ప్లే ఏరియా - టాయిలెట్లు వంటి సౌకర్యాలు కల్పించారు. మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ పర్యాటక శాఖ అభివృద్ధి పనులు చేపట్టింది.

కాలా పత్తర్ బీచ్‌.‌‌– అండమాన్

చుట్టూ పరుచుకున్న సంద్రపు నీటి నడమ పచ్చని ప్రకృతి అందాలు... అడవి పలకరింతకు పులకరించే పక్షుల కిలకిలరావాలు... వెచ్చని సూర్య కిరణాల స్పర్శకు మెరిసే నీటి అలలు... ఇది కాలాప‌త్త‌ర్ బీచ్ ప‌రిచ‌య వాక్యాలు. అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఈ బీచ్‌ లో మైమ‌రచిపోయే అందాల‌కు పెట్టింది పేరు. అక్టోబ‌ర్ నుంచి మే నెల‌లో ఎప్పుడైనా ఈ బీచ్‌ ను సంద‌ర్శించ‌డం బాగుంటుంది.

క‌షిడ్ బీచ్– మహారాష్ట్ర

మ‌హారాష్ట్రలో ఉన్న బీచ్‌లో వెండి లాంటి తెల్లటి ఇసుక ధగధగ మెరుస్తూ ఉంటుంది. సాయంత్రం పూట బీచ్ వద్దకు వెళ్లి, సేదతీరుతూ మరాఠా రుచులను తిని చూసేందుకు ముంబై - పూణేల్లో అల‌స‌పోయిన సిటీ జ‌నులు విచ్చేస్తుంటారు. అత్యంత ప‌రిశుభ్రంగా ఉండే ఈ బీచ్‌ ను శీతాకాలం మ‌రియు వ‌ర్షాకాలం సంద‌ర్శించ‌డం ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది.

అగట్టి బీచ్– లక్షద్వీప్

లక్షద్వీప దీవుల గేట్వేగా ఆగట్టి బీచ్ను పిలుస్తారు.ఆగట్టి దీవి విస్తీర్ణం సుమారు నాలుగు చ. కి. మీ ల కంటే కొంచెం తక్కువే.  సన్నని రోడ్డు మార్గం ద్వారా ద్వీపం అంతా చూపుతుంది కాబట్టి ఒక మంచి మోటార్ బైక్ పై ప్రయాణించటం మేలు. కాలి నడకన సైతం ఈ దీవి లో తిరిగినా ఎక్కువ సమయం పట్టదు. అద్భుత ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. అంతర్జాతీయ పర్యాటక రంగంలో ఆగట్టి మరియు లక్షద్వీప్ లు కొత్తగా చేరాయి. ఈ దీవులలో ఏ మాత్రం వాణిజ్య పర అంశాలు కనపడవు. ఇక్కడ విమానాశ్రయానికి కోచి మరియు బెంగుళూరు ల నుండి నేరు విమానాలు కలవు.

మాల్పే బీచ్‌– కర్ణాటక

ప్రశాంతంగా ఉండే నీటితో - నీలాకాశాలతో చూసేవారిని తన అందంతో ఆకట్టుకోవడం ఈ బీచ్ ప్రత్యేకత.ఇది ఉడుపి దేవాలయాల పట్టణం నుండి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక సహజమైన ఓడరేవు. కర్నాటక సముద్రతీరంలో ఒక ప్రధాన మత్స్య ప్రాంతం. మాల్పే లో ప్రధాన ఆకర్షణ దాని అద్భుత ద్వీప సముదాయం. ఇవి తీరం వెంబడి అగ్నిపర్వతం బద్దలవడంతో ఏర్పడ్డాయి. వీటిలో సెయింట్ మేరీ ద్వీపాలు యుగాల క్రిందట పర్వతం నుండి లావా వెదజల్లబడి చక్కటి రాతి ద్వీపాలుగా ఏర్పడ్డాయి. సెయింట్‌ మేరీస్‌ ద్వీపాలకు వెళ్లేటప్పుడు లేదా వచ్చేటప్పుడు ఈ ద్వీపాలను చూస్తూ ఆనందించవచ్చు. సమయం ఉందనుకుంటే ఈ బీచ్‌లో కూడా విహరించవచ్చు.మాల్పేకు సమీపాన ఉన్న విమానాశ్రయం 50 కి.మీ. దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయం. అక్కడి నుంచి క్యాబ్‌ లేదా ట్యాక్సీలలో ప్రయాణించి మాల్పే చేరుకోవచ్చు.



Tags:    

Similar News