నోట్ల ర‌ద్దుః అడ్డంగా బుక్ అయిన మోడీ

Update: 2016-11-13 04:18 GMT
రూ.500 - రూ.1000 నోట్లను రద్దు చేసే విషయం అధికార బీజేపీ తమ స్నేహితులకు ముందుగానే వెల్లడించిందన్న ఆరోపణలు నిజమేనని తెలుస్తోంది. తమ నాయకులు - వ్యాపార మిత్రులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకొనే అవకాశమిచ్చాకే ప్రధాని న‌రేంద్ర‌మోడీ పెద్ద నోట్ల రద్దు సంగతి ప్రకటించారన్న ఆరోపణలకు ఒక్కొక్కటిగా బలం చేకూరుతున్నది. రూ.2,000 నోటు ఆర్బీఐ మార్కెట్‌ లోకి విడుదల చేయకుండానే అవి బీజేపీ నేతల చేతుల్లో దర్శనమివ్వడం - వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకోవ‌డం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. కాగా ఈ ప‌రిణామంతో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు.

ఈ నెల 8న పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. కానీ బీజేపీ పంజాబ్ లీగల్ సెల్ నేత సంజీవ్ కాంబోజ్ అంతకు రెండురోజుల ముందే రూ.2000 నోటుతో ఫొటోకు పోజిచ్చి - దాన్ని ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు. 'త్వరలో కొత్త రూ.2000 నోట్లు రానున్నాయి' అని ఆ ఫొటో కింద వ్యాఖ్యానించారు. అప్పటికి విడుదల కాని నోటు ఆయనకెలా వచ్చిందని సందేహం వ్యక్తమవుతున్నది. బీజేపీ యూపీ రాష్ట్ర అధ్యక్షుడు కేపీ మౌర్య ఇంట్లో పెళ్లిలో నళినీ మౌర్య అనే యువతి రూ. 2000 నోట్ల కట్టలను పట్టుకొన్న ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ గా మారింది.  ఇలా ఆధారాల‌తో స‌హా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చ‌ర్య బ‌య‌ట‌ప‌డ‌టంతో ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు విరుచుకుప‌డ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ నోట్ల రద్దు గురించి బీజేపీ తన మిత్రులందరికీ ముందే సమాచారం చేరవేసిందని తేలింద‌న్నారు. బ్లాక్ మార్కెటీర్ల మీద కాకుండా సామాన్యుల పొదుపు మొత్తాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారని ఆరోపించారు. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో బ్యాంకుల్లో డబ్బు జమ చేయడం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని  మిత్రులందరినీ అప్రమత్తం చేశారనడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలని ప్ర‌శ్నించారు. ఇదంతా పెద్ద కుంభకోణమ‌ని కేజ్రీవాల్ ప్ర‌శ్నించారు. ''అంబానీ - అదానీ - సుభాష్ చంద్ర వంటి పారిశ్రామికవేత్తల వద్ద పెద్దమొత్తంలో నల్లధనం ఉందా?  రిక్షాపుల్లర్లు - తోపుడుబండ్లపై వ్యాపారాలు చేసుకొనేవారిదగ్గర నల్లధనం ఉంటుందా? ముందుగానే నోట్ల రద్దు విషయాన్ని తెలిసినవాళ్ల జాబితాను ప్రధాని మోడీ బయటపెట్టాలి?'' అని కేజ్రీవాల్‌ మూడు ప్రశ్నలు సంధించారు.

ఇది భారీ నల్ల కుంభకోణమ‌ని బెంగాల్ సీఎం మమత బెనర్జీ దుయ్య‌బ‌ట్టారు. ఏటీఎంలు - బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నవారంతా సామాన్యులని - సరైన ప్రణాళిక లేకుండా చేపట్టిన ఈ ప్రజా వ్యతిరేక విధానం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తాను స్వ‌యంగా చూశానని వెల్ల‌డించారు. ప్రభుత్వానికి దమ్ముంటే అసలు నేరస్థులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వెంటనే ఈ నల్ల రాజకీయ పథకాన్ని రద్దు చేయాలని కోరారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం అదుపు చేయాలన్న ఆలోచన సరైంది కాదని, ఇది ఫలితాలనివ్వదని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. అవినీతి పోవాలనడం మంచిదే కానీ నోట్ల రద్దుతో ఏమవుతుందని ప్ర‌శ్నించారు. అలాంటి నోట్లు కలిగినవారంతా ఇప్పుడు రూ. 2000 నోటు కోసం ఎదురుచూస్తున్నారని అఖిలేష్ ఎద్దేవా చేశారు. ఈ నోట్ల రద్దు అనేది బీజేపీ ఆడుతున్న మరో రాజకీయ నాటకమ‌ని కాంగ్రెస్ ప్రతినిధి - మాజీ న్యాయ‌శాఖా మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. నిజంగా ఆ పార్టీకి నల్లధనం అరికట్టాలని ఉంటే యూపీ - పంజాబ్ తదితర ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో తాను ఖర్చు చేస్తున్న మొత్తం గురించి వెల్లడించాల‌ని స‌వాల్ విసిరారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందిస్తూ నోట్ల రద్దు కార్యక్రమం ఆర్థిక వ్యవస్థకు బ్రేకులు వేసి సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తున్నదని మండిప‌డ్డారు. ఓ పథకమూ లేదు.. ఏర్పాట్లూ లేకుండా ప్రధాని ప్రకటన చేసి ప‌రేషాన్ చేస్తున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News