అర్ధరాత్రి కోర్టు కొత్తేమీ కాదు

Update: 2015-07-31 10:31 GMT
 ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమెన్ తనకు మరికొద్ది గంటల్లో ఉరిశిక్ష అమలవుతుందనగా చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అప్పటికప్పుడు అర్ధరాత్రి వేళ ఆ పిటిషన్ ను విచారించింది.  ఫలితం మాత్రం మెమొన్ కు అనుకూలంగా రాలేదు... అయితే.. సుప్రీంకోర్టు ఇలా అర్ధరాత్రి వేళ పనిచేయడం మాత్రం అరుదే. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో రెండు ఉరి శిక్షల కేసులలో సుప్రీం కోర్టు అర్దరాత్రి విచారణ చేసి ఉరి శిక్షలను రద్దు చేస్తు తీర్పు చెప్పింది. మంగల్ లాల్ బరోల, సుదీందర్ కోలి అనే ఇద్దరికి సంబంధించిన కేసుల్లోనూ వారికి ఉరి అమలవ్వడానికి కొద్ది గంటల ముందు రద్దు చేశారు.

తన పిల్లలను తానే అతి దారుణంగా హత్య చేశాడనే కేసులో మంగల్ లాల్ బరోలా అనే వ్యక్తికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. 2013 ఏప్రిల్ 9న ఆయన్ను ఉరేయడానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. రాష్ట్రపతి అతని క్షమాభిక్ష అర్జీని తిరస్కరించారు. అయితే ఉరి శిక్షకు ముందు రోజు రాత్రి 11 గంటల సమయంలో అతని న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తుల ఇంటిలోనే విచారణ జరిగింది. బరోలాకు ఉరి వెయ్యడానికి జైలులో సర్వం సిద్దం చేశారు. అయితే ఉరి శిక్ష అమలు కావడానికి సరిగ్గా అయిదు గంటల ముందు... అంటే రాత్రి 4 గంటల సమయంలో అతని ఉరి శిక్షను రద్దు చేస్తు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

17 మంది చిన్నారులను చంపిన సీరియల్ కిల్లర్ సురీందర్ కోలి కేసులోనూ సుప్రీం అర్ధరాత్రి తీర్పిచ్చింది. 2014 సెప్టెంబర్ 9వ తేదిన కోలీకి ఉరి వేయాల్సింది. అయితే అంతకు ముందు రోజు రాత్రి సురీందర్ న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హై కోర్టు న్యాయమూర్తులు హెచ్.ఎల్. దత్తు, ఎ.ఆర్ దావే సుప్రీం కోర్టు హాల్ లోనే అర్జీ విచారణ చేశారు. కోలి ఉరి శిక్షపై స్టే విదిస్తు ఆదేశాలు జారీ చేశారు.

ఈసారి యాకూబ్ కేసు కూడా అర్ధరాత్రే విచారణకు రావడంతో ఇంతకుముందు రెండు కేసుల్లో వచ్చిన తీర్పు వస్తుందని చాలామంది భావించారు.యాకూబ్ లాయర్లు అర్దరాత్రి 12.45 గంటల సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తు అర్జీ విచారణకు అంగీకరించారు. అయితే అర్జీ విచారణ చేసిన త్రిసభ్య బెంచ్ యాకూబ్ ఉరి శిక్ష రద్దు చెయ్యడానికి నిరాకరిస్తు అర్జీ కొట్టివేయడంతో యాకూబ్ బతకలేకపోయాడు.

కాగా మూడు సందర్భాల్లోనూ అర్ధరాత్రి విచారణల్లో జస్టిస్ హెచ్ ఎల్ దత్తు ధర్మాసనంలో ఉండడం విశేషం.
Tags:    

Similar News