చంద్రబాబు ప్రయారిటీ చట్టానికా.. చుట్టానికా?

Update: 2016-07-28 17:30 GMT
గట్టిగా ఏడేళ్ల సర్వీసు... ఏ జిల్లాకూ కలెక్టరుగా పనిచేసిన అనుభవం కూడా లేదు. అయినా.. నవ్యాంధ్ర రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యక్రమం మొత్తం ఆయన చేతిలో పెట్టారు చంద్రబాబు.  దీంతో సీనియర్ ఐఏఎస్ లు అందరూ మండిపడుతున్నారు. సీఆర్డీయే కొత్త కమిషనర్ నియామకం విషయంలో చంద్రబాబు చట్టం కంటే చుట్టరికానికే ప్రయారిటీ ఇచ్చారని విమర్శిస్తున్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నవ్యాంధ్ర కొత్త రాజధాని ఏర్పాటు కోసం తీసుకొచ్చింది కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ యాక్ట్(సీఆర్‌ డీఏ).  రాజధాని అమరావతి నిర్మాణం కోసం తానే చైర్మన్‌ గా చంద్రబాబు సీఆర్‌ డీఏను ఏర్పాటు చేశారు.  ఆ చట్టంలో చేసుకున్న బాసలకు చంద్రబాబు ఇప్పుడు నీళ్లొదిలేశారు. కావాల్సిన వ్యక్తిని సీఆర్‌ డీఏ కమిషనర్‌ గా నియమించుకునేందుకు నిబంధనలను పక్కనపెట్టేశారు. ఈ చట్టం ప్రకారం సీఆర్డీయే కమిషనర్ గా ఉండే వ్యక్తి గతంలో ఏదైనా జిల్లాకు  కలెక్టర్‌ గా పనికిచేసిన అనుభవం ఉన్నవారై ఉండాలి. అలాంటివారే కమిషనర్ పదవికి అర్హులు. సీఆర్‌ డీఏ చట్టంలోని సెక్షన్ 21(1) ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోంది.  కానీ చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన చెరుకూరి శ్రీధర్‌ అనే ఐఏఎస్ కోసం ఈ నిబంధనను పక్కనపెట్టేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  చెరుకూరి శ్రీధర్ కు  కమిషనర్‌ పదవి కట్టబెట్టేందుకు చట్టాన్ని పక్కకు నెట్టేశారు.

చెరుకూరి శ్రీధర్‌ ఇప్పటి వరకూ ఎక్కడా కలెక్టర్‌ గా చేయలేదు. ప్రస్తుతం ఆయన గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌ గా ఉన్నారు. ఆయన సర్వీస్‌ లోకి వచ్చింది కూడా 2009లోనే. ఇంతటి జూనియర్‌ అధికారి అయిన చెరుకూరికి ఏకంగా చంద్రబాబు కమిషనర్‌ పదవి కట్టబెట్టడంపై మిగిలిన వర్గాల అధికారులు మండిపడుతున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు కమిషనర్‌ గా వ్యవహరించిన నాగులాపల్లి శ్రీకాంత్‌ ను ఆ పదవి నుంచి తొలగించిన తీరుపైనా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నేరుగా సింగపూర్‌ కంపెనీల ప్రతినిధులతో రహస్య చర్చలు జరిపి రూపొందించుకున్న స్విస్‌ చాలెంజ్ నియమ నిబంధనలపై శ్రీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్విస్ చాలెంజ్ విధానాలన్నీ చట్టవిరుద్దంగా ఉన్నాయంటూ శ్రీకాంత్ తొలుత ప్రశ్నించారు. దాంతో స్విస్‌ చాలెంజ్‌ కు ఆమోద ముద్ర వేయించుకునేందుకు చంద్రబాబు .. నేరుగా తానే ఫైల్‌ పై సంతకం పెట్టి ఆ తర్వాత ఫైల్‌ ను సీఎస్ దగ్గరకు పంపించిన విషయం తెలిసిందే. దానిపై సీఎస్ కూడా షాకై అది తమకు ఎక్కడ ఇబ్బంది తెస్తుందో అని ఆందోళన కూడా చెందారు. దీంతో తనకు ఇష్టమైన వ్యక్తిని కమిషనర్‌ గా నియమించుకునేందుకు చంద్రబాబు పావులు కదిపారని చెబుతున్నారు.
Tags:    

Similar News