బలమైన బంధమే : విజయేంద్రప్రసాద్ రాజ్యసభ ఛాన్స్ వెనక....?

Update: 2022-07-08 01:57 GMT
సాధారణంగా హీరోలు తెలిసినంతగా టెక్నీషియన్స్ జనాలకు తెలియరు. ఇక ఆ మధ్య కాలం దాకా డైరెక్టర్లూ తెలిసేవారు కాదు. ఇపుడు అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ దాకా జనాలు గుర్తు పడుతున్నారు. అయినా సరే సినిమాకు ఆత్మ అయిన కధకుడి గురించి తెలిసిన వారు ఎవరూ పెద్దగా కనబడరు.  అంతా హీరో డైరెక్టర్ మహిమే అనుకుంటారు. అలాంటి కధకులలో ఒకరు కోడూరి విజయేంద్ర ప్రసాద్. ఆయన బాహుబలి. ట్రిపుల్ ఆర్ మూవీస్ కి చేసిన కధా రచనల  తరువాత జనాలకు బాగా తెలుసు అనుకున్నా తప్పే.

ఆయన గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి అంటే ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది. అలాంటి విజయేంద్రప్రసాద్ కి సడెన్ గా రాజ్యసభ పదవి దక్కింది. అది కూడా రాష్ట్రపతి కోటాలో. నిజంగా ఇది ఏ కోటి మందిలో ఒకరిద్దరికి దక్కే అరుదైన గౌరవం ఇది.  ఈ న్యూస్ బయటకు వచ్చిన క్షణం నుంచే విజయేంద్రప్రసాద్ అంటే ఎవరు, బాహుబలి, ట్రిపుల్ ఆర్ రైటరా. ఆయన సినిమా కధలు రాసుకుంటారు కదా. రాజ్యసభకు ఎలా నామినేట్ అయ్యారు. ఆయనకు రాజకీయ వాసనలు ఉన్నాయా. అందునా రాష్ట్రపతి కోటాలో చేయడం అంటే మామూలు విషయం కాదు కదా అన్న చర్చ అయితే టాప్ టూ బాటం జరుగుతూ వచ్చింది.

ఆయన రాసిన సినిమాలు తక్కువ. కానీ బ్లాక్ బస్టర్లు అయ్యాయి కొన్ని. ఇక పాన్ ఇండియా మూవీస్ కి విజయేంద్ర ప్రసాద్ కధలు రాయడం విశేషం అనుకున్నా అంత పేరు రావడం వెనక కుమారుడు రాజమౌళి టేకింగ్ మెరిట్స్ ఎక్కువ. ఇలా విజయేంద్రప్రసాద్ అన్న వారు ఎంతో కొంత జనాలకు తెలిసినా ఆయన పేరు వెనక ఎక్కువ క్రెడిట్ రాజమౌళికే దక్కుతుంది అనుకోవాలి.

సరే సినిమా వరకూ రైటర్ గా ఆయన ది గ్రేట్ అనుకున్నా ఆయనకు రాజ్యసభ పదవి దక్కే పరిస్థితి ఎలా వచ్చింది. దాని వెనక కధా కమామీషూ ఏంటి అన్నది కూడా వేయి ప్రశ్నలకు బుర్రలో దొలిచేలా చేస్తూ వచ్చింది. అపుడు ఎన్నో కొన్ని విషయాలు ప్రచారంలో ఉన్నవో లేక అందరూ అనుకున్నవో కానీ ఒక్కోటీ తెలుస్తూ వస్తున్నాయి. చిత్రంగా ఇవి విజయేంద్రప్రసాద్ కధల కంటే కూడా బిగ్ ట్విస్టులతో ఇవి కూడుకుని  ఉంటున్నాయి.

ఇలాంటి విషయాలు చూస్తే విజయేంద్రప్రసాద్ పూర్తిగా ఆరెస్సెస్ భావజాలం ఉన్న వారు అని అంటున్నారు. ఆయనకు నేరుగా నాగపూర్ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంతోనే కనెక్షన్ ఉందని కూడా అంటున్నారు. ఇక ఆయన వీర హిందూత్వవాదిగా చెబుతున్నారు. అది బీజేపీ ప్రవచించిన హిందూత్వను నమ్మే కరడుకట్టిన వ్యక్తిగా ఆయన పేరు చెబుతున్నారు.

అలా ఆయనకు ఉన్న పరిచయాలే ఈ రోజు ఈ సమున్నతమైన గౌరవానికి, ఉన్నతమైన పదవికి కారణం అంటున్నారు. ఇక ఆయన గురించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ అయితే కొంత చర్చకు తావిస్తోంది. విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక రంగంతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచవ్యాప్తం గా ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. అతను రాజ్యసభకు నామినేట్ అయినందుకు నా అభినందనలు అని మోడీ ట్వీట్ చేశారు.

ఇక్కడే చాలా మంది మళ్ళీ డౌట్లో పడుతున్నారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కధలను ఆయన ఏమి రచించారు అన్న వాదనను కూడా కొంతమంది లేవనెత్తుతున్నారు. అలాగే చూస్తే ఆయన పక్కా కమర్షియల్ మూవీస్ కే ఎక్కువ రచనలు చేశారు. ఇక ట్రిపుల్ ఆర్ అన్న మూవీ ఫిక్షన్ గానే అంతా చూస్తున్నారు. బాహుబలి అయితే ఒక అందమైన చందమామ కధగానే గుర్తుంచుకుంటారు. ఇలా ఎన్నో విషయాలు మోడీ ట్వీట్ మీద కూడా చర్చకు వస్తున్నాయి.

ఏది ఏమైనా విజేయంద్రప్రసాద్ కాషాయం పార్టీకి భలే బాగా  నచ్చేశారు. ఆయనతో బీజేపీ వారి బంధం బహు గట్టిది. ఆయనకు ఆరెస్సెస్ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం దోహదపడింది. అందుకే ఆయన ఎంపీ అయ్యారు. ఏది ఏమైనా బీజేపీ ఏం చేసినా ఒక సంచలనం. అందులో భాగంగానే విజయేంద్రుడి పదవి కూడా చెప్పుకోవాలి.
Tags:    

Similar News